TS: ఉద్యోగ నోటిఫికేషన్‌లో ట్విస్ట్‌.. అభ్యర్థులకు షాక్‌!

4 Aug, 2022 00:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ప్రకటన లేకుండా ఉద్యోగ అర్హత నిబంధనల్లో మార్పులు చేయటం మహిళా అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఉద్యోగం రావటం, రాకపోవటం సంగతి అటుంచితే కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేని స్థితి ఏర్పడింది.

అయితే, రవాణాశాఖలోని అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) 113 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. మల్టీజోన్‌–1లో 54, మల్టీజోన్‌–2లో 59 పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. వీటిలో మహిళలకు 41 పోస్టులు రిజర్వ్‌ చేసింది. మెకానికల్‌ ఇంజినీరింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ, లేదా తత్సమాన విద్యార్హత, మూడేళ్ల ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమాలను విద్యార్హతలుగా ఖరారు చేసింది. ఈనెల 5 నుంచి సెప్టెంబరు ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఇంతవరకు బాగానే ఉంది. నోటిఫికేషన్‌ వెలువడ్డ తేదీ నాటికి మహిళా అభ్యర్థులు కూడా కచ్చితంగా హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు పొంది ఉండాలని నిబంధన విధించింది. ఇక్కడే చిక్కొచ్చి పడింది. గతంలో ఈ పోస్టుకు ఈ నిబంధన లేదు. మహిళలకు మినహాయింపు ఉండటంతో చాలామంది ఆ లైసెన్సు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు వారెవరూ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వరకు లైసెన్సు తీసుకుని ఉండేలా నిబంధన మార్చాలని మహిళా అభ్యర్థులు కోరుతున్నారు. 

ఆ లైసెన్సు తీసుకోవటానికి తగు సమయం ఇవ్వాలని, తరువాతే దరఖాస్తులు ఆహ్వానించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో, ఆ మేరకు సడలింపు ఇస్తే బాగుంటుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దానికి సానుకూలంగా నిబంధన మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

ఇది కూడా చదవండి:  బల్దియాపై పిడుగు

మరిన్ని వార్తలు