ఉచిత తాగునీటి పథకానికి తాజా మార్గదర్శకాలివే

31 Dec, 2021 13:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం అమలుపై మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తాజాగా గురువారం మరిన్ని మార్గదర్శకాలు జారీచేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మురికి వాడలు, అన్ని గృహవినియోగ నల్లాలకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు నీటిబిల్లులు మాఫీ చేయనున్నారు. ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు, రెండో నల్లా కనెక్షన్‌ కలిగిన వినియోగదారులకు కూడా మాఫీ వర్తించనుంది. 

జనవరి 2022 నుంచి మురికి వాడలు మినహా ఇతర ప్రాంతాల వినియోగదారులకు నీటివినియోగం ఆధారంగా నీటిమీటరు రీడింగ్‌తో బిల్లులు జారీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్‌సెస్‌ చెల్లించిన వినియోగదారులకు భవిష్యత్‌లో వారి కనెక్షన్‌కు జారీచేసే బిల్లులో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. ఆధార్‌ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు 13 నెలల నీటిబిల్లు జారీ చేయనున్నారు. దీనిపై ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుం ఉండదు. (చదవండి: ప్లాట్‌.. పాస్‌‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు)

మరిన్ని వార్తలు