Hyderabad: ఉచిత నీటి పథకానికి సమీపిస్తున్న గడువు

24 Dec, 2021 15:32 IST|Sakshi

గత ఏడు రోజుల్లో  20 వేల మంది అనుసంధానం

ప్రతి గృహవినియోగ నల్లాకూ మీటరు తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందేందుకు వినియోగదారులు తమ కనెక్షన్‌ నంబరుకు ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు జలమండలి ఈ నెల 31 చివరి గడువు విధించిన విషయం విదితమే. మహానగరంలో మొత్తం 9.84 లక్షల నల్లాలు ఉండగా ఈ నెల 17 వరకు సుమారు 50 శాతం మంది మా త్రమే నమోదు ప్రక్రి యను పూర్తిచేసుకున్నారు. వారం రోజులుగా అన్ని డివిజన్లలో కలిపి సుమారు 20 వేల మంది అనుసంధానం పూర్తి చేసుకున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నెల 31తో గడువు తీరనుండడంతో ఎంత మంది ముందుకొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.   

ఉచితానికీ బద్ధకమేనా.. 
► నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి జలమండలి 13 నెలల సమయమిచ్చినా సిటీజన్లు ముందుకు రాకపోవడం గమనార్హం. నగరంలో అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లున్న పలువురు వినియోగదారులు వాటిని అద్దెకిచ్చి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి అనుసంధానం చేసుకునే విషయంలో పలు ఇబ్బందులున్నాయి.

► వాణిజ్య నల్లాలు మినహా సుమారు 4.10 లక్షల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవాలని జలమండలి సూచించింది. లేని పక్షంలో ఈ 13 నెలల నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

► ఈ బిల్లుపై పెనాల్టీ, వడ్డీ మాత్రం విధించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి వేలల్లో నీటి బిల్లు చూసి వినియోగదారులు బెంబేలెత్తకుండా నాలుగు వాయిదాల్లో 13 నెలల బిల్లును చెల్లించే వెసులుబాటు ను కల్పించనున్నట్లు తెలిపింది.

► ఉచిత నీటిపథకానికి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచే సదరు వినియోగదారులు నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని పొందుతారు. అప్పటివరకు నీటి బిల్లు చెల్లించాల్సిందే. (చదవండి: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్..)

మీటర్లు తప్పనిసరి... 
ప్రతి గృహవినియోగ నల్లాకూ నీటి మీటరును సైతం వినియోగదారులు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే మీటర్లు  ఉంటే అవి పని చేసే స్థితిలో ఉండాల్సిందే. ఈ మీటరు రీడింగ్‌ ఆధారంగా నెలకు 20 వేల లీటర్ల కంటే అధిక వినియోగం ఉన్న వినియోగదారుల నుంచి నీటిబిల్లు విధిగా వసూలు చేయనున్నారు. అపార్ట్‌మెంట్లలో ఉన్న అన్ని ఫ్లాట్ల యజమానులు అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయా ఫ్లాట్ల వినియోగదారులకు నీటి బిల్లులు తథ్యం. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్‌)

మరిన్ని వార్తలు