పానీ చోర్‌.. పారాహుషార్‌

14 Jul, 2021 17:02 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నల్లాలపై జలమండలి విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రధాన నగరంతో పాటు శివార్లలోనూ బోర్డు విజిలెన్స్‌ పోలీసుల ఆధ్వర్యంలో అక్రమార్కులను జల్లెడ పడుతున్నారు. ఏళ్లుగా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో పలువురు నల్లాలను అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వైనంపై లోతుగా ఆరా తీస్తున్నారు. తీగ లాగితే డొంక కదులుతున్న చందంగా ఈ అక్రమాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ఇటీవల నగర శివార్లలోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. అయిదు అక్రమ నల్లాల ఏర్పాటుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ క్షేత్రస్థాయి ఉద్యోగిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం గమనార్హం. 

ఒక్కొక్కటిగా వెలుగులోకి..  
►మహానగర పరిధిలో జలమండలికి 10.80 ల క్షల నల్లా కనెక్షన్లున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ(డొమెస్టిక్‌), మరో 2 లక్షల వరకు మురికి వాడలు (స్లమ్స్‌), మరో 80 వేల వరకు వాణిజ్య, బల్క్‌ నల్లా కనెక్షన్లున్నాయి. ఇవి కాక సుమారు లక్ష వరకు అక్రమ నల్లాలున్నట్లు అంచనా. 

►పాత నగరం, ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనే తేడా లేకుండా ఈ అక్రమ నల్లాలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు జలమండలి అక్రమ నల్లాల భరతం పట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల తనిఖీలను ముమ్మరం చేయడంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది.   

►అక్రమ నల్లాలపై జలమండలి నజర్‌ 
►శివార్లు, నగరంలో విస్తృత తనిఖీలు 
►‘ఇంటి దొంగల’పైనా కేసులు నమోదు 
►గ్రేటర్‌ పరిధిలో లక్ష వరకు అక్రమ నల్లాలు 

కంచే చేను మేసిన చందంగా..  
►జలమండలి పరిధిలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బంది సహకారంతో పలువురు ఈ అక్రమ నల్లాలను ఏర్పాటు చేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. భూమి లోపలున్న జలమండలి మంచినీటి పైపులైన్లకు అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా కన్నాలు వేసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. 

►ఈ వ్యవహారంలో బోర్డు సిబ్బంది, ప్రైవేటు ప్లంబర్లు, జలమండలి  నల్లా కనెక్షన్లు మంజూరు చేసే గ్రీన్‌బ్రిగేడ్‌ సిబ్బంది పాత్ర సుస్పష్టం. ఏళ్లుగా బదిలీలు లేకుండా పనిచేస్తున్న సిబ్బంది కీలక పాత్రధారులుగా ఉంటున్నారు. విజిలెన్స్‌ పోలీసుల తనిఖీల్లో అక్రమ నల్లాలు బయటపడిన తర్వాత సదరు భవనాల యజమానులు, ఇందుకు సహకరించిన బోర్డు సిబ్బందిపైనా ఐపీసీ 269,430 సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. 

సమాచారం అందించండి.. 
అక్రమ నల్లాలపై ఎలాంటి సమాచారాన్నైనా తమకు అందించాలని జలమండలి నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. గృహ వినియోగ నల్లా కనెక్షన్‌ తీసుకొని కమర్షియల్‌ అవసరాలకు వినియోగిస్తున్న వారిపైనా 99899 98100, 99899 92268 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కోరింది.  ఉచిత తాగునీటి పథకం పక్కదారి పట్టకుండా ఉండాలంటే అక్రమ నల్లాల అంతు చూడాలని జలమండలి భావిస్తోంది. ఈ దిశగా ముందుకు వెళుతోంది. అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులను ముమ్మరం చేసింది.
 

మరిన్ని వార్తలు