TS: అంగన్‌వాడీల్లో ‘ఇంటి భాష’లో బోధన

4 Oct, 2021 01:45 IST|Sakshi

‘మైనార్టీ, గిరిజన, ఏజెన్సీ’ కేంద్రాల్లో ఉర్దూ, లంబాడ, గోండు, కోయ తదితర భాషలకు ప్రాధాన్యం

అంగన్‌వాడీలను గుర్తించాలని అధికారులకు సూచనలు

ఆయా భాషల్లో పుస్తకాలు ముద్రించాలని శిశు సంక్షేమశాఖ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలోనే బోధన చేపట్టాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు మరింత సులభంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలో దీనిని అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధన, అభ్యసనకు సంబంధించిన పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అన్నీ తెలుగులో, ఒకట్రెండు ఇంగ్లిష్‌లో ఉంటున్నాయి.

వీటి ద్వారా మైనార్టీలు, గిరిజనులు అధికంగా ఉండే అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధన చేస్తున్నప్పటికీ వారు ఇంట్లో మాట్లాడే భాషలో చెప్పే అంశాలనే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మైనార్టీలు, గిరిజన తెగలున్న ఆవాసాలు, ఏజెన్సీలు తదితర ప్రాంతాల్లో పిల్లల మాతృ భాషలోనే బోధన సాగిం చాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ దిశలో చర్యలు తీసుకుంటోంది. రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.

భాషల వారీగా కేంద్రాల గుర్తింపు..
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 17.04 లక్షల మంది పిల్లలు నమోదు కాగా, రోజుకు సగటున 6 లక్షల మంది హాజరవుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి వారి మాతృభాషలో బోధన నిర్వహించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లోని అంగన్‌వాడీల్లో ఉర్దూ, గిరిజన తండాల్లో లంబాడ, ఏజెన్సీ ప్రాంతాల్లో గోండు, కోయ, కొలామ్‌ భాషల్లో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సీడీపీఓలకు ఒక ప్రణాళికను తయారు చేసి పంపించింది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక భాషల్లో పుస్తకాలను ముద్రించి ఆశ్రమ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ సహకారాన్ని తీసుకునేందుకు సంబంధిత అధికారులతో శిశు సంక్షేమ శాఖ చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించి పిల్లల మాతృ భాషలో బోధనను ప్రారంభించాలని ఆ శాఖ భావిస్తోంది.   

మరిన్ని వార్తలు