పాతబస్తీలో 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం

23 Nov, 2020 09:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో పుట్టి పెరిగారు. చట్టసభకు ఎంపికయ్యారు. రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్నారు. బల్దియా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్న వేళ ఆజంపురా కేంద్రంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు హోంమంత్రి మహమూద్‌ అలీ. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా డివిజన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. నగరంలో జరిగిన  అభివృద్ధిని చూసి ప్రజలు  టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కడతారని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు.    

 టీఆర్‌ఎస్‌ ఎన్ని డివిజన్లను కైవసం చేసుకుంటుంది?  
బల్దియాలో గత ఐదేళ్లలో దేశంలోని ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌లో జరిగింది. నగరం మెరుస్తోంది.  టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి గ్రేటర్‌ జనం ఓటు వేస్తారని భావిస్తున్నాం. వంద డివిజన్లకుపైగా గెలుస్తాం.  

 మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌కు పొత్తు ఉందా? 
మేం సొంతంగా 150 డివిజన్లలో బరిలో నిలిచాం. మాకు ఏ పారీ్టతోనూ పొత్తు లేదు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 డివిజన్లలో గెలిచాం. పాతబస్తీలో ఈసారి 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం. మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌కు పొత్తు ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు.   

 నగరంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి?  
దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక పరికరాలతో పోలీస్‌ శాఖ పని చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో నగర శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉండేది. టీఆర్‌ఎస్‌ అధికారంలో వచి్చనప్పటి నుంచి నగర ప్రజలు శాంతియుతంగా జీవనం కొనసాగిస్తున్నారు. మతకల్లోలాలు, కర్ఫూలు, ఘర్షణలు లేవు. క్రైమ్‌ రేట్‌ ఇతర నగరాల కంటే చాలా తక్కువగా ఉంది.  

నగరంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదనే విమర్శలపై మీరేమంటారు?   
టీఆర్‌ఎస్‌ అధికారంలో రాకముందు నగరంలో గంటల తరబడి విద్యుత్తు ఉండేది కాదు. ప్రస్తుతం 24 గంటలపాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి.  తాగునీరు పుష్కలంగా వస్తోంది. ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. రూ.5కు భోజనం అందిస్తున్నాం. విద్య, వైద్య వ్యవస్థలు మెరుగుపడ్డాయి   

టీఆర్‌ఎస్‌ పాలనలో మైనారిటీల సంక్షేమం ఎలా ఉంది? 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెక్యులర్‌ నాయకుడు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది. కేవలం మైనారిటీలనే కాదు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు ప్రవేశపెట్టాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది.  

మైనారిటీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారానే విమర్శలున్నాయి?  
మతత్వ పార్టీలు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పింగిచాలని చూస్తున్నాయి. ఆ పార్టీల ఆగడాలు సాగవు. నగర ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అన్ని మతాలను గౌరవిస్తుంది. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం సరికాదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా