Hyderabad Honour Killing: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్తకోణం

6 Jul, 2022 08:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రకాశం జిల్లాకు చెందిన నారాయణరెడ్డిని నిందితులు పక్కా పథకం ప్రకారమే అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తు న్న శ్రీనివాస్‌రెడ్డి..తన బంధువుల అమ్మాయి ని నారాయణరెడ్డి ప్రేమ, పెళ్లి పేరుతో పరువుకు భంగం కలిగించడంతో పాటు మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని..అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని మరో ఇద్దరు నిందితులతో కలిసి రెండు నెలల ముందే పక్కాగా స్కెచ్‌ వేసినట్లు తెలిసింది.

ఇందుకు అవసరమయ్యే ఖర్చులు, సహకరించిన వారికి సుపారీ పేరు తో యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డి నుంచి రూ.ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ముందుగా మూడు లక్షలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు అదే ప్రాంతానికి చెందిన కాశీ, షేక్‌ ఆషిక్‌లతో కలిసి నారాయణరెడ్డిని గత నెల 27న అంతమొందించిన త ర్వాత విషయాన్ని వెంకటేశ్వరరెడ్డికి వీడియోకాల్‌ ద్వారా తెలిపి ముగ్గురు ఒక్కొక్క లక్ష రూపాయలు తీసుకొని ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. అయితే నారాయణరెడ్డి కనిపించకుండా పోయిన ఫిర్యాదును స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తును మొదలు పెట్టారు.  

నారాయణరెడ్డికి చివరిగా వచ్చిన శ్రీనివాసరెడ్డి సెల్‌ నెంబర్‌ ఆధారంగా అతనికి ఫోన్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరెడ్డి మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్‌ చేసి తనకు పోలీసులు ఫోన్‌ చేస్తున్నారు, మీరు కూడా ఎవరికి దొరకకుండా ఉండాలని, ఏమి చెప్పవద్దని హెచ్చరించి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. దీంతో శ్రీనివాసరెడ్డి ఫోన్‌ నుంచి చివరిగా కాల్‌ వెళ్లిన కారు డ్రైవర్‌ షేక్‌ ఆషిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మొత్తం కుట్రకోణం బట్టబయలయ్యింది. దీంతో శ్రీనివాసరెడ్డి, కాశి, షేక్‌ ఆషీక్, వెంకటేశ్వరరెడ్డిలపై కేసునమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

కాగా హత్యకేసులో ముందుగా పట్టుబడి వివరాలు వెల్లడించిన షేక్‌ ఆషిక్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్‌ విధించింది. షేక్‌ ఆషిక్‌ నగరంలోని ఓ పేరొందిన కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేసినట్లు తెలిసింది. అయితే అతని ఇంటిని గాలించిన సమయంలో అతని ప్యాంటు జేబుల్లో 50 వేల నగదుతో పాటు అతను తాను చదువుతున్న  కళాశాల నుంచి తీసుకున్న టీసీ కనిపించింది. కాగా శ్రీనివాసరెడ్డి, కాశీలు  గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో గతంలోనే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిసింది.   

చదవండి: (Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!) 

మరిన్ని వార్తలు