హర్రర్‌ సినిమాను తలపించే వరద దృశ్యాలు

21 Oct, 2020 14:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలతో నగరంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. హిమాయత్‌ సాగర్‌, హుస్సేన్‌ సాగర్‌ అలుగులు పోస్తున్నాయి. మూసీ ఉగ్రరూపం దాల్చింది. వీధుల్లో వరద నీరు కంటపడ్డ వస్తువులను తనలో కలిపేసుకుని బీభత్సం సృష్టించింది. ఈక్రమంలోనే చాంద్రాయణగుట్టలోని బాబానగర్‌లో శనివారం రాత్రి వెలుగుచూసిన దృశ్యాలు హార్రర్‌ సినిమాను తలపిస్తున్నాయి. ఒకవైపు కుండపోత వర్షం, మరోవైపు కరెంటు లేకపోవడంతో బాబానగర్‌ వాసులు బిక్కుబిక్కుమంటూ.. ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్న సమయంలో.. తెల్లవారుజాము మూడు గంటలకు ఒక్కసారిగా ఆ ప్రాంతంలోకి వరద చొచ్చుకువచ్చింది.

గుర్రం చెరువు కట్ట తెగిపోవడంతో బాబానగర్‌లోని చాలా ఇళ్లల్లో చూస్తుండగానే 10 అడుగుల మేర నీరు చేరింది. అన్ని దిక్కుల నుంచి వరద చేరి ఇళ్లల్లోని వస్తువులన్నీ సుడులు తిరిగాయి. మరింత లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లో మొదటి అంతస్థు వరకు నీరు చేరింది. అయితే, గుర్రం చెరువు కట్ట తెగిందనే సమాచారంతో స్థానికులు అప్రమత్తం కావడంతో.. మృత్యువులా దూసుకొచ్చిన వరదల నుంచి అందరూ తప్పించుకున్నారు. ఎంతటి గుండె ధైర్యానికైనా గుబులు పుట్టించే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మరిన్ని వార్తలు