సాయం తీసుకుని చపాతీలు, పూరీలు చేసుకోండి అంటే.. అదే అదనుగా..

20 Dec, 2021 04:39 IST|Sakshi
చపాతీలు తయారు చేస్తున్న విద్యార్థులు

కోరుట్ల: రాష్ట్రంలో సోషల్‌ వెల్ఫేర్‌ బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. గురుకులాల్లో ప్రతి ఆదివారం అల్పాహారం తయారు చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే పడుతోంది. వంట మనుషుల్లేక ఒక్కోవారం ఒక్కో తరగతి విద్యార్థులు ప్రణాళిక వేసుకొని కావాల్సినవి తయారు చేసుకోవాల్సి వస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది.

67 గురుకులాలు.. 2,200 మంది విద్యార్థులు
రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌ వెల్ఫేర్‌ బీసీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు 67 వరకు ఉన్నాయి. ఇందులో 5 నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో రోజూ విద్యార్థులకు టిఫిన్‌ అందజేస్తారు. ప్రతి 80 మంది విద్యార్థులకు ఓ వంటమనిషి ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గురుకులంలో సుమారు ఆరుగురు వంట మనుషులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో ఈ లెక్కన వంట మనుషుల్లేరు. సగానికి మించి గురుకులాల్లో ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన టిఫిన్‌ కేటరింగ్‌ ద్వారా తెప్పిస్తున్నారు. లేదంటే విద్యార్థులతోనే తయారు చేయిస్తారు. దాదాపు మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది.

సాయం తీసుకోమన్నందుకు..
వారంలో 6 రోజుల పాటు కిచిడీ, ఇడ్లీ, అటుకులు వంటి టిఫిన్లు వంట మనిషులు లేదా కేటరింగ్‌ ద్వారా తెప్పిస్తున్నారు. అయితే ఆదివారం గురుకులాల్లో తప్పనిసరిగా చపాతీ లేదా పూరీ టిఫిన్‌గా పెట్టాలి. ఒక్కో గురుకులంలో ప్రతి ఆదివారం ఒక్కో విద్యార్థికి రెండు చపాతీలు లేదా పూరీల చొప్పున దాదాపు వెయ్యి వరకు కావాలి. ఇంత పెద్దమొత్తంలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు తలకు మించిన భారమవుతోందని చాలాచోట్ల ఉన్నతాధికారులకు ప్రిన్సిపాళ్లు నివేదించినట్లు సమాచారం. దీంతో ఆదివారం పిల్లల సాయం తీసుకుని చపాతీ లేదా పూరీలు తయారు చేసుకోవాలని అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదే ఆసరాగా కొన్నిచోట్ల గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున విద్యార్థులే చపాతీలు, పూరీలు చేసేలా ప్రణాళిక వేసి వంటపనులు చేయిస్తున్నారు. 
 
మౌఖిక ఆదేశాలున్నాయి
ఆదివారం పెద్దసంఖ్యలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు సాధ్యం కావట్లేదు. దీంతో పిల్లల సాయం తీసుకోవాలని అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున పిల్లల సాయంతో చపాతీలు చేయిస్తున్నాం. మిగిలిన రోజుల్లో పిల్లలకు సమస్య ఉండదు.
– బాబు, ప్రిన్సిపాల్, కోరుట్ల సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల

మరిన్ని వార్తలు