స్మార్ట్‌ ఫోన్‌ ఉందా?

31 Jul, 2020 03:13 IST|Sakshi

విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్న గురుకుల సొసైటీలు

ఇప్పటికే టెన్త్, ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థుల డేటా సేకరణ పూర్తి

75% విద్యార్థుల వద్ద స్మార్ట్‌ఫోన్లు.. ఆన్‌లైన్‌ పాఠాల బోధనకు కసరత్తు

త్వరలో ఆన్‌‘లైన్‌’లోకి 8, 9 తరగతులు.. ఆ తరువాత కింది క్లాసులు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘బాబూ.. నేను గురుకుల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా స్మార్ట్‌ఫోన్‌ ఉందా? ఇంటర్నెట్‌ ప్యాకేజీ వాడుతున్నారా? వాళ్లు ఏ సమయంలో ఇంట్లో ఉంటారు? వెంటనే కనుక్కుని చెప్పు..’’ ఇదీ గురుకుల పాఠశాలల విద్యార్థుల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది సేకరిస్తున్న సమాచారం. 

అన్‌లాక్‌ 3.0 ప్రక్రియ లోనూ విద్యాసంస్థల్ని తెరిచేందుకు మోక్షం కలగలేదు. కరోనా విజృంభణతో ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు. దీంతో విద్యార్థులు దారిమళ్లకుండా ఉండేందుకు బోధన, అభ్యసన కార్యక్రమాలను కొనసాగించాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీలు భావిస్తున్నాయి. ఇం దులో భాగంగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన సాగుతోంది. ఈ క్రమంలో గురుకుల విద్యార్థులు చదువులో వెనుకబడకుండా వారికీ ఆన్‌లైన్‌ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఇందుకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు పిల్లల వద్ద ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తున్న సొసైటీలు.. క్షేత్రస్థాయిలో ప్రిన్సిపాల్, టీచర్లకు బాధ్యతలు అప్పగించాయి. తమకందని మౌఖిక ఆదేశాల మేరకు వీరంతా సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. 

టెన్త్, ఇంటర్‌ సెకండియర్‌ వాళ్లకు.. 
ప్రస్తుతం గురుకుల సొసైటీలు పదోతరగతి, ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఇప్పటికే మహాత్మాజ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. టెన్త్, ఇంటర్‌ సెకండియర్‌ వాళ్లకు గత పక్షం రోజులుగా జూమ్, గూగుల్‌ మీటింగ్‌ యాప్‌ల్లో ఆన్‌లైన్‌ తరగతులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ ప్యాకేజీలను పరిశీలిస్తే.. అన్ని నెట్‌వర్క్‌ల్లో దాదాపు రోజుకు 1.5 జీబీ డాటా ఉంటుంది. దీంతో రెండు గంటల పాటు ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తే దాదాపు ఒక జీబీ డాటా వినియోగమవుతుంది. దీంతో మూడు తరగతులు మాత్రమే బోధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఉదయం రెండు, సాయంత్రం ఒక క్లాస్‌ ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇళ్లలో ఉన్న సమయాన్ని అంచనా వేసి ఇలా ఉదయం, సాయంత్రం తరగతులు చెబుతున్నామని, ఆన్‌లైన్‌ తరగతులను తను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి చెప్పారు.  

75 శాతం స్మార్ట్‌ఫోన్లే..
గురుకుల పాఠశాలల్లో ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో గరిష్టంగా 40 మంది పిల్లలున్నారు. ఈ క్రమంలో ప్రతి సెక్షన్‌లో ఉన్న విద్యార్థులకు వ్యక్తిగతంగా ఫోన్లుచేసి వివరాలు సేకరించి ప్రత్యేక నమూనాలో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ పాఠశాలలు ఈ సమాచార సేకరణ పూర్తి చేశాయి. ప్రతి తరగతిలో గరిష్టంగా 75 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు లేదా అన్న, అక్కల్లో ఒకరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నట్లు గుర్తించారు. తరగతుల వారీగా పరిశీలిస్తే కొన్ని సెక్షన్లలోని విద్యార్థుల వద్ద నూరు శాతం స్మార్ట్‌ ఫోన్లు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు