కరోనా సోకిందని రానివ్వని ఇంటి యజమాని

28 Jul, 2020 12:00 IST|Sakshi

దిక్కుతోచక గుట్టల్లో ఆశ్రయం పొందిన కానిస్టేబుళ్లు

ఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం

మహబూబాబాద్‌ రూరల్‌: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విధులు నిర్వర్తించిన తమకు ఇప్పుడు వైరస్‌ సోకపోవడంతో పట్టించుకునే వారే లేకుండా పోయారని జిల్లాకు చెందిన స్పెషల్‌ పార్టీ పోలీసు కానిస్టేబుళ్లు సారంగపాణి, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక పోలీసు దళంలో పనిచేస్తున్న సుమారు 20 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకగా, హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారని తెలిపారు.

అయితే, తమలో ఒకరు అద్దె ఇంట్లో ఉంటుండగా, యజమాని కుటుంబంలో వివాహం ఉండడంతో లోనకు రావొద్దన్నారని చెప్పారు. ఇంకొకరి ఇంట్లో చిన్న పిల్లలు ఉండడంతో వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. అయితే, తా మిద్దరం ఆస్పత్రిలో ఉంటామంటే రెండు రోజుల అనంతరం వసతి చూపిస్తామని వైద్యాధికారులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచక జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సమీపాన గుట్టల ప్రాంతంలో తలదాచుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి తాము ఆస్పత్రిలో చికిత్స పొందేలా చూడాలని వేడుకున్నారు. కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు గుట్టల్లో ఆశ్రయం పొందున్న విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో ఎస్పీ కోటిరెడ్డి రంగంలోకి దిగారు. ఇంటి యజమానులతో పాటు కానిస్టేబుళ్లతో చర్చించగా వారు సోమవారం రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు