భళా బిందు.. స్వయం ఉపాధి

10 Oct, 2020 10:35 IST|Sakshi
పనులను చేయిస్తున్న భానుసాయి బిందు

సాక్షి, ఖమ్మం: పని చేయాలనే తపన, స్వయం ఉపాధి పొందాలనే ఆసక్తితో ఖమ్మంలోని ముస్తఫానగర్‌కు చెందిన వి. భానుసాయిబిందు ధైర్యంగా, వినూత్న మార్గం ఎంచుకున్నారు. హౌస్‌ కీపింగ్‌ సేవల పేరిట..పెద్దపెద్ద ఇళ్లు, వివిధ సంస్థల కార్యాలయాలను శుభ్రపరచడం, వస్తువలన్నింటినీ అందంగా సర్దడం, ఇళ్లు మారినప్పుడు సామగ్రినంతా ప్యాకింగ్‌ చేసి భద్రంగా మరోచోటుకు తరలించడం తదితర పనులను తనతో పాటు పలువురు మహిళలతో కలిసి చేస్తున్నారు. పనిపట్ల చూపే ప్రత్యేక శ్రద్ధ వల్ల మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ గుర్తింపు పొందుతున్నారు. ఎంకామ్‌ ఉన్నత విద్య చదివిన వంగిభురాత్చి భానుసాయిబిందు ముస్తఫానగర్‌ పురపాలక సంఘం బోర్డు దగ్గర జిరాక్స్, నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక సంస్థలో హౌస్‌ కీపింగ్‌లో శిక్షణ పొంది..కేవలం మహానగరాలకే పరిమితమైన సేవలను ఐదు సంవత్సరాల క్రితం కీర్తి హౌస్‌ కీపింగ్‌ సర్వీసెస్‌ పేరిట ఖమ్మం నగరానికి పరిచయం చేసి..కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 20 మంది మహిళలకు పని కల్పిస్తున్నారు. వీరితో పాటు 10 మంది పురుషులు కూడా ఉపాధి పొందుతున్నారు. గూగుల్‌లో కీర్తి హౌస్‌ కీపింగ్‌ సర్వీసెస్, ఖమ్మం అని టైప్‌చేస్తే వీరి పూర్తి వివరాలు, చేసిన పనుల వీడియోలు చూడొచ్చు. 

నగర వాసులకు ప్రత్యేకం
ఉరుకులు పరుగుల కాలంలో, ఉద్యోగ, వ్యాపార ఒత్తిడిలో ఉన్న వారికి వీరి సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగం చేసే వారు కొందరైతే, అనారోగ్య సమస్యలతో పనులు చేసుకోలేకపోయేవారు ఇంకొందరు, వంట, ఇతర పనులతో బిజీగా ఉండి ఇంటిని శుభ్రం చేసుకోకపోవడం,  అందంగా సర్దుకోవడానికి సమయం లేని వారు అనేకమంది. వీరందరికీ ఉపయోగపడుతోంది కీర్తిహౌస్‌ కీపింగ్‌ సర్వీస్‌. ఇల్లు శుభ్రం చేసి వస్తువులు అందంగా సర్దడానికి కూడా పనివాళ్లు దొరుకుతారా..? అంటే మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు.. సమయానికి వచ్చి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి.. ప్రతిఫలంగా డబ్బులు తీసుకుని ఉపాధి పొందుతున్నారు.  

ఇళ్లకు వచ్చి అందించే సేవలు ఇవే..
నగరంలో కీర్తి హౌస్‌ కీపింగ్‌ సర్వీస్‌ వారు తమ సేవలను విస్తృతంగా అందిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఇళ్లు, కార్యాలయాల్లో బూజులు దులపడం, కార్పెట్, సోఫాలను వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయడం, ఇల్లు మారినప్పుడు సామానంతా సురక్షితంగా చేరవేయడం చేస్తున్నారు. ఇంకా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్, పెయింటర్, చెదలు నియంత్రణ, కార్పెంటర్‌ తదితర పనులు కూడా చేస్తున్నారు. ఇన్వెర్టర్, గీజర్, ఏసీ, ఆర్‌వో సిస్టమ్‌ బిగించాలన్నా, మరమ్మతులు చేయాలన్నా మేమున్నాం అంటూ ఒక్క ఫోన్‌ చేస్తే వచ్చేస్తాం అంటున్నారు. 

ఉపాధి  కల్పించాలనే..
తొలుత నెట్‌ సెంటర్‌ ద్వారా స్వయం ఉపాధి పొందా. చిన్న ఆలోచనతో పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో హౌస్‌ కీపింగ్‌ సర్వీసెస్‌ను ప్రారంభించాను. 10 మంది మహిళలతో కలిసి మొదలెట్టా. ఇప్పుడు 30మంది పనిచేస్తున్నారు. ఖమ్మంలో మేం చేస్తున్న పనులకు మంచి గుర్తింపు వస్తోంది. మా సేవలు పొందాలంటే 88974 35396 సెల్‌ నంబర్‌లో సంప్రదించవచ్చు. 
– భానుసాయి బిందు, కీర్తి హౌస్‌ కీపింగ్‌ సర్వీసెస్‌ నిర్వాహకురాలు, ఖమ్మం

మరిన్ని వార్తలు