ఔటర్, హైవేలపై జాగ్రత్త.. పొగ మంచులో ప్రయాణాలొద్దు!

13 Jan, 2023 15:22 IST|Sakshi

పూర్తిగా తెల్లవారిన తర్వాతే జర్నీ మేలు

ఔటర్, హైవేలపై వాహనాలను నిలపకూడదు

అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదాలు తప్పవు

పలు సూచనలు చేసిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ, వారాంతం కలిసి రావటంతో నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు తెల్లవారుజామున ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత సూర్యకాంతిలో ప్రయాణించడం శ్రేయస్కరమని సూచించారు. వ్యక్తిగత వాహనాల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నగరవాసులకు ట్రాఫిక్‌ పోలీసులు పలు సూచనలు చేశారు. 

ఔటర్, హైవేలపై జాగ్రత్త.. 
దట్టమైన పొగమంచు కారణంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రహదారులలో వాహనాలను నిలపకూడదు. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు ఏమాత్రం నలత అనిపించినా, నిద్ర వచ్చినా రోడ్డు మీద వాహనాన్ని క్యారేజ్‌పై నిలివేయకుండా రోడ్డు దిగి ఒక పక్కన లేదా కేటాయించిన పార్కింగ్‌ స్థలంలో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. 

పొగ మంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించదు. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. బ్రేకులు వేసేటప్పుడు వెనకాల వస్తున్న వాహనాలను అద్దాల నుంచి చూసి మాత్రమే వేయాలి తప్ప అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, ఇతర వాహన డ్రైవర్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా బీమ్‌ హెడ్‌లైట్లను వినియోగించాలని సూచించారు.  

డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఇవి పాటించండి
► ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించాలి. 
► హజార్డ్‌ లైట్లను ఆన్‌ చేసి ఉంచాలి. 
► సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, కారులో అధిక శబ్ధం మ్యూజిక్‌తో ప్రయాణించకూడదు. వెనకాల వచ్చే వాహనాల హారన్‌ వినిపించదు. 
► పొగమంచులో ఎదుటి వాహనాలు, పశువులు స్పష్టంగా కనిపించవు. అందుకే తరుచూ హారన్‌ కొడుతూ ప్రయాణించడం ఉత్తమం. 
► లేన్‌ మారుతున్నప్పుడు లేదా మలుపుల సమయంలో కిటికీలను కిందికి దింపాలి. దీంతో వెనకాల వచ్చే ట్రాఫిక్‌ స్పష్టంగా వినిపిస్తుంది. 
► ఐదారు గంటల పాటు కంటిన్యూగా డ్రైవింగ్‌ చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. (క్లిక్ చేయండి: పండుగ ప్రయాణం.. నరకయాతన)

మరిన్ని వార్తలు