కరోనా తొలి సవాల్‌..ధైర్యంతో జవాబ్‌

8 Mar, 2021 08:30 IST|Sakshi

కరీంనగర్‌ సిటీ: రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్‌లో గతేడాది మార్చిలో 14 మందికి కోవిడ్‌ సోకింది. ఒక్కసారిగా దేశం చూపు కరీంనగర్‌ వైపు మళ్లింది. అప్పటికీ దేశంలో పెద్దగా కోవిడ్‌ కేసులు లేవు.. ఎలా నియంత్రించాలో నిర్ధిష్టమైన చర్యలూ లేవు. ఆ సమయంలో నేనున్నానంటూ ముందుకు కదిలారు కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి. నాటి కోవిడ్‌ సవాల్‌ను అధిగమించిన తీరు ఆమె మాటల్లోనే.. ‘మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే కరీంనగర్‌పై కరోనా పంజా విసిరింది. ఇండోనేషియా నుంచి వచ్చిన 14 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆ సమయంలో ఎలా ముందుకెళ్లాలన్నది పెద్ద చాలెంజ్‌. అప్పటికి దేశంలో ఎక్కడా కోవిడ్‌ నియంత్రణకు ఎలాంటి ప్రామాణిక చర్యలూ లేవు. ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తూనే నడుం బిగించాం. పాజిటివ్‌ వచ్చిన వారి సమాచారం సేకరించి ఆయా ప్రాంతాలను వెంటనే రెడ్‌జోన్‌గా ప్రకటించడం సవాల్‌గా మారింది. 

కళ్లలో నీళ్లు తిరిగాయి..
మొదట రెడ్‌జోన్‌లో ఉన్న ప్రజలు బయటకు రాకుండా చూడ్డానికి వారికి నిత్యావసరాలు అందించాం. మొదట రెడ్‌జోన్‌లోకి వెళ్లడానికి మా సిబ్బందీ భయపడేవారు. నేనే ముందుగా పీపీఈ కిట్‌ వేసుకుని వెళ్లి వారికి అవగాహన కల్పించాను. ఇంటింటికీ సరుకులు అందించగలిగాం. ఇక, నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించుకునేందుకు వలస కూలీలు పడుతున్న కష్టాలు చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే మిత్రులతో కలిసి ఫైనాన్స్‌ ఫియర్స్‌ అనే సంస్థ ద్వారా వారిని ఆదుకున్నాం.

ఫిర్యాదులపై స్పందిస్తూ..
కరోనా సమయంలో కోవిడ్‌ సెంటర్‌లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించట్లేదని ఒకసారి ఫిర్యాదు వచ్చింది. అధికారులేమో అంతా బాగుందని చెప్పారు. కానీ మళ్లీ ఫిర్యాదు రావడంతో నేను వెళ్లి చూశాను. అంతా అపరిశుభ్రంగా ఉంది. ఇదేమిటని సిబ్బందిని అడిగితే లోనికి వెళ్లడానికి భయపడుతున్నామని చెప్పారు. దీంతో నేనే పీపీఈ కిట్‌ వేసుకుని కోవిడ్‌ సెంటర్లలో కలియతిరిగాను. సిబ్బందికీ వైద్యుల సాయంతో పీపీఈ కిట్లు వేసుకునే విధానంపై శిక్షణ కూడా ఇచ్చాం. 

అయినవారూ దగ్గరికి రాలేదు..
నగరంలో కోవిడ్‌ నియంత్రణలో బిజీగా ఉంటుండగానే మా నాన్నకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. కరోనా నియంత్రణలో అందరికీ ధైర్యం చెబుతూ వచ్చిన నాకు.. నేను ఎంతగానో ఇష్టపడే నాన్నకు పాజిటివ్‌ రావడంతో ఏం చేయాలో పాలుపాలేదు. వెంటనే నాన్నను ఆస్పత్రిలో చేర్పించి ఇటు విధులు నిర్వహిస్తూ నే అటు నాన్నను కంటికి రెప్పలా చూసుకునేదాన్ని. ఇక, కరోనా మరణాలు బాధించాయి. కోవిడ్‌ను సమర్థంగానే నియంత్రించగలిగినా.. తరువాత మరణాలు ప్రారంభం కావడంతో వారి అంత్యక్రియలు సవాల్‌గా మారాయి. మరణించిన వారి దగ్గరికి బంధువులూ వచ్చే వారు కాదు. అయినా ఎలాంటి లోటు రానివ్వకుండా వారి అంత్యక్రియలు నిర్వహించాం. మొదటి పోస్టింగ్‌లోనే క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి రావడం ఇప్పటికీ ఎంతో ఉద్విగ్నతకు గురిచేస్తోంది.

మరిన్ని వార్తలు