తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు ఎన్ని?

3 Jul, 2021 13:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో 42,575 ప్రైవేటు పాఠశాలలు

అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 9వ స్థానం

9, 10 తరగతుల్లో డ్రాపౌట్‌ రేట్‌ 12.3 శాతం

యూడీఐఎస్‌ఈ ప్లస్‌ 2019–20 నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈ+) 2019–20 నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది. 

ఉత్తరప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఏకంగా 93,750 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఆ తర్వాత రాజస్తాన్‌లో 36,056 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. 2019–20 లెక్కల ప్రకారం తెలంగాణలో 42,575 పాఠశాలలున్నాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 30,001 ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు 702 ఉన్నాయి. ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ (ప్రభుత్వ గుర్తింపు పొందిన) పాఠశాలలు 11,688 ఉన్నాయి.

రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 3,05,597 ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 1,52,298 మంది ఉండగా, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 4,006 మంది ఉన్నారు. ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1,48,814 మంది టీచర్లు ఉన్నారు. ఇవిగాక ఇతర స్కూళల్లో 479 మంది ఉన్నారు. కాగా, విద్యార్థులు 8వ తరగతి వరకు బాగానే చదువుతున్నారు. కానీ పేదరికం, ఇతరత్రా కారణాల వల్ల 9, 10 తరగతులు వచ్చే సరికి బడులు మానేస్తున్నారు. తెలంగాణలో ఆ తరగతులకు వచ్చే సరికి బడి మానేస్తున్నవారి రేటు 12.3 శాతం ఉందని నివేదిక తెలిపింది. 

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. 
► రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 22.7 శాతం 
► 42,575 స్కూళ్లకు విద్యుత్‌ సౌకర్యం ఉంది.  
► 95.61 శాతం స్కూళ్లకు తాగునీటి వసతి ఉంది. 
► 97.09 స్కూళ్లల్లో బాలికల మరుగుదొడ్లు ఉన్నాయి.  
► 92.07 శాతం స్కూళ్లల్లో బాలురకు మరుగుదొడ్లు ఉన్నాయి.  
► మొత్తంగా 98.06 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. 
► 42,575 పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 
► అలాగే 42,575 స్కూళ్లల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది.   

మరిన్ని వార్తలు