Power Saving Tips: మీ చేతిలోనే ‘పవర్‌’.. కరెంట్‌ బిల్లు స్లాబ్‌ రేట్ల తగ్గుదలకు 10 చిట్కాలు

14 Dec, 2021 19:02 IST|Sakshi

విద్యుత్‌ను మనం ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ.. వృథా చేయకుండా పొదుపు చేస్తే పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లే. అనవసరంగా కరెంట్‌ను వాడకుండా పొదుపు చేయవచ్చు. తద్వారా వినియోగం యూనిట్లు తగ్గి బిల్లు స్లాబ్‌ రేట్లు తగ్గుతాయి. బిల్లుల రూపేణ చెల్లించే ఖర్చులు తగ్గుతాయి. మంగళవారం నుంచి 21 వరకు విద్యుత్‌ వారోత్సవాలు జరగనున్నాయి. కరెంటు ఆదా చేసే ఆ పది పద్ధతులు ఏంటో చూద్దాం. 
–సాక్షి, హన్మకొండ

విద్యుత్‌ పొయ్యి
ఆహారపదార్థాలు వండడానికి నిర్దేశించిన సమయానికంటే కొన్ని నిమిషాల ముందే విద్యుత్‌ స్టౌను ఆపేయాలి.సమతలమైన అడుగును కలిగిన వంటపాత్రలను ఉపయోగించాలి. ఎందుకంటే అవి పొయ్యిలోని కాయిల్‌ పూర్తిగా కప్పబడి ఉంటాయి. విద్యుత్‌ సద్వినియోగమై వంట త్వరగా పూర్తవుతుంది.

మిక్సీలు 
రోజువాడే వాటిలో మిక్సీలు, గ్రైండర్లు ముఖ్యమైనవి. పొడిగా ఉండే వాటిని మెదపడానికి ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. తడి పదార్థాలను తక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి పొడులు చేయడం తగ్గించుకోవాలి. ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఉండే గృహోపకరణాలను వాడితే విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. 

ఫ్యాన్లు
ఫ్యాన్‌ లేని ఇల్లు.. గది అంటూ ఉండదు. మనం ఏ గదిలో ఉంటామో అక్కడే ఫ్యాన్‌ ఆన్‌ చేసుకోవాలి. అక్కడినుంచి మరో గదిలోకి వెళ్లినప్పుడు ఆఫ్‌ చేయడం మరిచిపోవద్దు. రెగ్యులరేటర్‌ను కచ్చితంగా వాడాలి. ఇప్పుడు తక్కువ కరెంటు వినియోగంతో.. ధారాళంగా గాలి వచ్చే ఫ్యాన్లు వస్తున్నాయి. వాటిని వాడాలి. 

బల్బులు ఆర్పివేయాలి
ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్‌లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్‌ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్‌ పొదుపు అవుతోంది. బాత్రూమ్‌లలో చిన్న బల్బులను వాడాలి. బల్బులు ఆర్పివేయాలి. ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్‌లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్‌ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్‌ పొదుపు అవుతోంది. బాత్రూమ్‌లలో చిన్న బల్బులను వాడాలి.

ఎయిర్‌ కండిషనర్లు
గది ఉష్ణోగ్రతను బట్టి దానికదే నియంత్రించుకునే పరికరాలను కొనాలి. తక్కువ చల్లదనం స్థితిలో ఉండేలా రెగ్యులేటర్లను ఉంచాలి. ఏసీతోపాటు సీలింగ్‌ ఫ్యాన్‌ కూడా వేసి ఉంచండి. అందువల్ల గది మొత్తం తొందరగా చల్లబడుతుంది. ఏసీలోని ధర్మోస్టాట్‌ నార్మల్‌ దగ్గర ఉంచాలి. లేకపోతే ఎక్కువ కరెంట్‌ ఖర్చవుతుంది.

ఫ్రిజ్‌లు
క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయడం వల్ల మాన్యువల్‌ డీప్రాస్ట్‌ చేయాల్సిన ఫ్రిజ్, ఫ్రిజర్లు, ఫ్రిజ్‌లోని మోటార్‌ సరిగ్గా పనిచేసేందుకు శక్తిని పెంచుకుంటాయి. ఫ్రిజ్‌కు.. గోడకు మధ్య గాలి ఆడేలా కొంతస్థానాన్ని ఉంచాలి. డోర్‌ సరిగ్గా పట్టిందో, లేదో సరిచూసుకోవాలి. వేడిగా లేదా వెచ్చని పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

మైక్రోవేవ్స్‌ ఓవెన్స్‌ 
ఇవి సంప్రదాయక విద్యుత్‌ లేదా గ్యాస్‌ స్టౌ కన్నా 50 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఆహారపదార్థాలు ఓవెన్‌లో పెట్టాక ఎంత వరకు వచ్చాయో చూడడానికి మాటిమాటికి తలుపు తెరవద్దు. అలా తెరచిన ప్రతిసారీ 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తిరిగి మళ్లి వేడెక్కడానికి విద్యుత్‌ ఖర్చవుతుంది.

 టీవీ
టీవీ లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు అంతా ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ అధునాత టెక్నాలజీతో వస్తున్నాయి. ఒక్కోసారి మనం టీవీ ఆన్‌చేసి ఇతర పనుల్లో నిమగ్నమవుతాం. అది మోగుతూనే ఉంటుంది. అలాకాకుండా మనం చూసిన తరువాత ఆఫ్‌ చేయడం మరిచిపోవద్దు. ఆన్‌లో ఉంటే 10వాట్ల శక్తిని నష్టపరుస్తుంది.

కంప్యూటర్లు 
ఉపయోగించనప్పుడు ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్లను ఆఫ్‌ చేయడం మంచిది. ఎందుకంటే 24 గంటలు పనిచేసే ఒక కంప్యూటర్, ఫ్రిజ్‌ కన్నా ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. స్లీప్‌ మోడ్‌ ఉండేలా సెట్టింగ్‌ చేయడం ద్వారా దాదాపు 40శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ను కూడా ఇదేవిదంగా చేయాలి. 

 సోలార్‌ వాటర్‌ హీటర్‌
చలికాలంలో వేడినీటితో స్నానం తప్పనిసరి. నీటిని వేడి చేసేందుకు విద్యుత్‌ హీటర్‌ బదులుగా సోలార్‌ వాటర్‌ హీటర్‌ను ఉపయోగించడం ఉత్తమం. విద్యుత్‌ హీటర్‌ ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. కొంత ప్రమాదకరం కూడా. రోజువారీగా చెక్‌ చేసుకుంటూ పోతే సోలార్‌కు పెద్దగా ఖర్చు ఉండదు. 

విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి...
వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. దీనివల్ల ధనాన్ని పొదుపు చేసుకున్నట్లే. వినియోగదారులు విద్యుత్‌ చాలా తక్కువగా వినియోగించే ఉపకరణాలు వాడాలి. టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ పొదుపు చేయడంలో, సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ముందుంది. ఇండియా గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఊర్జా, స్కోచ్‌ అవార్డులు అందుకుంది.
-ఎన్నమనేని గోపాల్‌రావు, సీఎండీ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ

మరిన్ని వార్తలు