Hyderabad: నాగారం, ఘట్‌కేసర్‌, దమ్మాయిగూడలో లింక్‌ రోడ్లు

29 Aug, 2022 16:16 IST|Sakshi

శివారు రహదారులకు మోక్షం

రూ.293 కోట్లతో 13 లింక్‌ రోడ్ల నిర్మాణం

టెండర్లు ఆహ్వానించిన హెచ్‌ఆర్‌డీసీఎల్‌

దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, ఘట్‌కేసర్‌లలో.. 

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలోని రహదార్లకు మహద్భాగ్యం కలుగనుంది. నగరానికి తూర్పున ఉన్న మేడ్చల్‌ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, ఘట్‌కేసర్‌ స్థానికసంస్థల పరిధిలో 4 లేన్లు, 6 లేన్లతో విశాలమైన రహదారులు రానున్నాయి. ఇన్నర్‌ రింగ్‌రోడ్, ఔటర్‌రింగ్‌ రోడ్‌కు అనుసంధానంగా ప్రజల సాఫీ ప్రయాణానికి లింక్, స్లిప్‌రోడ్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల 104 రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. వాటిల్లో 50 రోడ్ల పనుల్ని ప్రాధాన్యతతో చేపట్టాల్సిందిగా సూచించింది.  

ఐదు ప్యాకేజీలుగా.. 
మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులకు నిధులు మంజూరు చేయగా వాటిల్లో మూడో ప్యాకేజీలోని 13 కారిడార్ల (రోడ్ల) పనులు చేసేందుకు హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) టెండర్లు ఆహ్వానించింది. వీటి అంచనా వ్యయం రూ.293.55 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన భూసేకరణ, యుటిలిటీస్‌ షిఫ్టింగ్‌ వంటి పనులు లేని ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరగనున్నాయి. వీటికి అవసరమైన నిధుల్ని హెచ్‌ఎండీఏ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.   

టెండర్లు పిలిచిన రోడ్ల వివరాలు.. 
దమ్మాయిగూడ మునిసిపాలిటీలో.
► దమ్మాయిగూడ రోజ్‌గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ నుంచి నాగారం రోడ్‌ (ఈసీఐఎల్‌ను కలుపుతూ): 2.80 కి.మీ.లు.  
► చీర్యాల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం హౌసింగ్‌ కాలనీ నుంచి అహ్మద్‌గూడ: 1.70 కి.మీ.లు. 

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో.. 
► ఫైరింగ్‌ కట్ట నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం రోడ్‌ వరకు: 2.10 కి.మీ.లు   
► ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి దమ్మాయిగూడ రోడ్‌ (మునిసిపల్‌ పరిధి వరకు ): 1.90 కి.మీ.లు  
► ఎన్టీఆర్‌  విగ్రహం నుంచి డంపింగ్‌ యార్డ్‌ వరకు: 2.35 కి.మీ.లు  
► ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్‌ వరకు: 1.20 కి.మీ.లు 

నాగారం మునిసిపాలిటీలో.. 
► రాంపల్లి క్రాస్‌రోడ్స్‌  నుంచి సర్వే నెంబర్‌ 421 వరకు(హెచ్‌పీ పెట్రోల్‌పంప్‌ దగ్గర) : 3.90 కి.మీ.లు. 
► సర్వే నెంబర్‌ 421 (హెచ్‌పీ పెట్రోల్‌పంప్‌ దగ్గర)నుంచి యామ్నాంపేట  (నాగారం మునిసిపాలి టీ సరిహద్దు వరకు): 3.10 కి.మీ.లు.  
► చర్లపల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌రోడ్‌ వరకు( వయా కరీంగూడ ): 3.80 కి.మీ.లు  
► యామ్నాంపేట ఫ్లైఓవర్‌ నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వరకు: 2.60 కి.మీ.లు   
► చర్లపల్లి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ నుంచి రాంపల్లి జంక్షన్‌ వరకు: 3.30 కి.మీ.లు   

పోచారం మునిసిపాలిటీలో.. 
► యామ్నాంపేట  నుంచి ఓఆర్‌ఆర్‌  సర్వీస్‌ రోడ్‌ వరకు: 2.10 కి.మీ.లు  

ఘట్‌కేసర్‌ మునిసిపాలిటీలో.. 
► శివారెడ్డిగూడ నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి : 2.50 కి.మీ.లు. 

ప్రయోజనాలు 
ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే నగరంనుంచి శివారు ప్రాంతాలకు సాఫీ రవాణా సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రయాణదూరం, సమయం, ఇంధనవ్యయం తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గడంతో ప్రయాణాల వల్ల తలెత్తే ఆరోగ్య ఇబ్బందులూ తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్‌: రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నిర్మాణం)

మరిన్ని వార్తలు