సరిహద్దు వైన్స్‌కు భారీ గిరాకీ

16 Nov, 2021 03:34 IST|Sakshi

ఆంధ్రా సరిహద్దు మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు 

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పాతవ్యాపారుల నజర్‌ 

సిండికేట్లుగా మారడంతో వెల్లువలా దరఖాస్తులు  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఏపీ సరిహద్దు జిల్లాల్లోని మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా ఇక్కడ వ్యాపారం ‘మూడు బాటిళ్లు, ఆరు కాటన్‌లు’గా ఉంటుందని సదరు వ్యాపారులు లాభమోహాల్లో, ఊహల్లో తేలిపోతున్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా కొందరు నేతలు కూడా రంగంలోకి దిగి తమ బినామీలతో దరఖాస్తులు దాఖలు చేయిస్తున్నారు.

పాత వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సరిహద్దు జిల్లాలవారీగా.. ఖమ్మం 122, భద్రాద్రి కొత్తగూడెం 88, నల్లగొండ 155, సూర్యాపేట 99 మద్యం షాపులున్నాయి. 

పాతవ్యాపారుల్లో కొత్త ఉత్సాహం 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, తల్లాడ, ముదిగొండ, చింతకాని, బోనకల్, ఎర్రుపాలెం మండలాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, హుజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, హాలియా, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను సొంతం చేసుకునేందుకు పాత వ్యాపారులు కొత్తకొత్తగా పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా అన్‌రిజర్వ్‌డ్‌ దుకాణాలకు ఈ ప్రాంతాల్లో భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.

ఈ జిల్లాల్లోని పాత వ్యాపారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌కు చెందిన కొం దరు బడానేతలు కూడా తమ బినామీలతో దరఖాస్తు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దుకాణం దక్కించుకుంటే రెండేళ్ల కాల పరిమితి వరకు వ్యాపారం చేసుకోవచ్చు. రెండేళ్ల చివరినాటికి రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఎన్నికలు రానుండటం కూడా దరఖాస్తులు ఎక్కువగా నమోదు కావడానికి మరో కారణంగా చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,280కుపైగా దరఖాస్తులు వచ్చా యి. ఇందులో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలవే అధికం. 

రిజర్వ్‌డ్‌ దుకాణాలకు పోటాపోటీ 
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రిజర్వ్‌డ్‌ దుకాణాలకు పోటాపోటీగా దరఖాస్తులు వస్తున్నాయి. రిజర్వ్‌ అయిన దుకాణాలకు సంబంధించి ఎవరికీ బినామీలుగా ఉండకుండా తామే దరఖాస్తులు దాఖలు చేయాలని ఆ కేటగిరీకి చెందిన నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తమ సామాజికవర్గానికి చెందిన ముఖ్యులతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.

అదే సామాజికవర్గానికి చెందిన, మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్నవారిని పిలిచి చర్చించినట్లు సమాచారం. ఎవరికీ బినామీలుగా ఉండకుండా తమకు రిజర్వ్‌ అయిన దుకాణాలకు తమ కేటగిరీవారే దరఖాస్తు చేసేలా ముందుకు వెళ్లాలని సదరు నేత సూచించినట్లు తెలిసింది. రిజర్వ్‌డ్‌ కేటగిరీలోనైనా దుకాణాలను దక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో మద్యం అమ్మకాల ద్వారా భారీగా సొమ్ము చేసుకోవచ్చని భావిస్తున్నారు. 

భాగస్వామిగా ఇతరులకు..
ఈసారి వైన్స్‌ల్లో కొన్నింటిని గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. ఈ కేటగిరీలవారు అవసరమైతే ఇతర కులాలవారినీ వ్యాపార భాగస్వాములుగా చేర్చుకోవచ్చని ఈ నెల 8న జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఎక్సైజ్‌ కమిషనర్‌ పూర్తిస్థాయి విచారణ జరిపి భాగస్వామికి అర్హతలున్నాయని భావించిన తర్వాతే అనుమతిస్తారు.

భాగస్వామి రిటైల్‌ షాపు ఎక్సైజ్‌ ట్యాక్స్‌లో 3 శాతం లేదా రూ.3 లక్షల్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భాగస్వామిగా చేరేందుకు కూడా కొందరు పాత వ్యాపారులు రిజర్వ్‌ కేటగిరీ వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు.  

ఖమ్మం ఎక్సైజ్‌ స్టేషన్‌  1 వద్ద దరఖాస్తులు దాఖలు చేసేందుకు సోమవారం రాత్రి వేచి ఉన్న ఔత్సాహికులు   

మరిన్ని వార్తలు