జోరందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. మరింత రద్దీ

30 Dec, 2020 20:17 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో రిజిస్టేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మొన్నటి వరకు స్తబ్దుగా నడిచిన రిజిస్టేషన్ల ప్రక్రియ తాజా ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకుంది. ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పాత వాటికి లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందని, అయితే కొత్తవాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్టేషన్ చేస్తున్నామని సబ్‌ రిజిస్టార్‌ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చదవండి: హమ్మయ్య.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉపశమనం

ఎల్ఆర్ఎస్ రద్దుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్టర్‌ కార్యాలయాలకు వచ్చేవారు చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్‌కు ఒక మంచి గిఫ్ట్‌గా భావిస్తున్నామని చెబుతున్నారు. కాగా రిజిస్టేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌తోపాటు ఎల్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అయితే కొత్త పద్దతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు