ఎంటెక్‌ చేశావా.. టీచింగ్‌ చేస్తావా?

17 Apr, 2022 04:04 IST|Sakshi

సాంకేతిక విద్యలో మాస్టర్‌ డిగ్రీ చేసిన వాళ్లకు మున్ముందు భారీ డిమాండ్‌ 

పెరుగుతున్న కొత్త యూనివర్సిటీలు 

సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెంపు

అర్హులైన అధ్యాపకుల కోసం వేట

రెండేళ్లలో వేతనాలు రెట్టింపు కావొచ్చంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక విద్యలో మాస్టర్‌ డిగ్రీ (ఎంటెక్‌) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్‌ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్‌లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్‌ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్‌ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. 

కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్‌ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్‌ చేస్తున్నారు. 

రెండేళ్లలో భారీగా అవసరం
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్, ఇతర కంప్యూటర్‌ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్‌ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్‌ సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్‌ లెర్నింగ్, రోబోటిక్స్‌ వంటి కోర్సులున్నాయి.

మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్‌ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్‌ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. 

కొరత ఎందుకు?
సాధారణంగా విద్యార్థులు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్‌ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్‌ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్‌లో సీట్లు భారీగా మిగులుతున్నాయి.

ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్‌ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్‌వేర్‌తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే.

జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు
ఓవైపు కంప్యూటర్‌ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్‌ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్‌తోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్‌కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. 
– ప్రొఫెసర్‌ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌) 

మరిన్ని వార్తలు