హంసవాహనంలో రామయ్య జల విహారం 

2 Jan, 2023 00:34 IST|Sakshi

భద్రాచలంలో కనులపండువగా తెప్పోత్సవం 

భారీగా తరలి వచ్చిన భక్తజనం 

నేడు ఉత్తర ద్వార దర్శనం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రగిరిపై కొలువైన వైకుంఠ రాముడు గోదావరి నదిలో జలవిహారం చేశారు. హంసవాహనంలో సీతాసమేతుడై జలవిహారం చేస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తర లివచ్చారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం నిర్వ హించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుప్పావై సేవాకాలం, మూలవర్లకు అభిషేకం, వేద పారాయణం, ప్రబంధ పాశుర పఠనం.. తదితర కార్యక్రమాలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు.

మధ్యాహ్నం దర్బారు సేవ అనంతరం ప్రత్యేక పల్లకిలో సీతాసమేత రామచంద్రస్వామిని మేళతాళాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ హంసాకృతిలో అలంకరించిన పడవలో సీతారాములను వెంచేపు చేసి, ఆగమ శాస్త్ర పద్ధతి లో షోడశోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు హంస వాహనంలో స్వామివారి జలవిహారం ప్రారంభమైంది.

ఒక్కో పరిక్రమణాని కి ఒక్కో రకమైన హారతి ఇస్తూ కనుల విందుగా వేడుకను నిర్వహించారు. రాత్రి 7:01 గంటలకు ఐదు పరిక్రమణాలతో తెప్పోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కా గా, భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో సోమవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు