కనిష్ట ఉష్ణోగ్రత @ 7.1 డిగ్రీలు 

12 Nov, 2020 03:52 IST|Sakshi

వికారాబాద్‌ జిల్లా  మర్పల్లిలో అత్యల్పం నమోదు 

రాష్ట్రంలో రోజురోజుకూ పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పతనమవుతున్నాయి. చలి తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గగా.. రాత్రిపూట భారీగా పడిపోయాయి. ప్రస్తుతం సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈసారి చలి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 7.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఆ తర్వాత అదే జిల్లా మోమీన్‌పేట్, సంగారెడ్డి జిల్లా కొహిర్‌లో 7.2 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్, న్యాల్కల్‌లో 7.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక వాతావరణ శాఖ మెట్‌ స్టేషన్లలో కనిష్టం(సరాసరి)గా ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీలు నమోదు కాగా, దుండిగల్‌లో 12.5 డిగ్రీలు, మెదక్‌లో 12.8, హకీంపేట్‌లో 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఆదిలాబాద్, దుం డిగల్, హన్మకొండ, హైదరాబాద్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం స్టేషన్లలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌ బేగంపేట కేంద్రంలో 12.4 డిగ్రీ సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. 

మరో రెండ్రోజులు పొడి వాతావరణమే... 
రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. చలి తీవ్రత పెరుగుతుండటంతో కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీలంక తీరానికి దగ్గరలోని నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు