ట్రేడ్‌ లైసెన్సు లేకుంటే భారీ జరిమానా

28 Sep, 2020 03:56 IST|Sakshi

తెలంగాణ ట్రేడ్‌ లైసెన్సు రూల్స్‌–2020 ప్రకటించిన పురపాలక శాఖ 

తొలి 3 నెలలు 25%, ఆ తర్వాత 50 శాతం లైసెన్సు ఫీజు 

లైసెన్సు పునరుద్ధరించుకోకపోతే సంబంధిత ఏడాదిలో జూన్‌ వరకు 25 %, జూలై నుంచి 50 శాతం ఫీజు  

ట్రేడ్‌ లైసెన్సుల జారీకి కొత్త రేట్లు ఖరారు  

సాక్షి, హైదరాబాద్‌: ట్రేడ్‌ లైసెన్స్‌ లేని వ్యాపారాలపై సర్కారు కొరడా ఝళిపించనుంది.  మున్సిపల్‌ ప్రాంతాల్లో ట్రేడ్‌ లైసెన్సు తీసుకోకుండా వ్యాపారాలు చేసేవారిపై, గడువు తీరిన లైసెన్సులతో వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించేవారిపై భారీ జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రేడ్‌లైసెన్సు తీసుకోకపోతే వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచి తొలి మూడు నెలల వరకు 25 శాతం, ఆ తర్వాత నుంచి లైసెన్సు తీసుకునే వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని అధికారులను ఆదేశించింది. గడువు తీరిన ట్రేడ్‌లైసెన్సుతో వ్యాపారాలు నిర్వహించేవారికి సంబంధిత ఏడాది జూన్‌ వరకు 25 శాతం, జూలై 1 నుంచి ట్రేడ్‌లైసెన్సు పునరుద్ధరించుకునే నాటి వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపాలిటీల ట్రేడ్‌ లైసెన్సు నిబంధనలు–2020ను ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ విడుదల చేశారు.  

వ్యాపారాలను బట్టి లైసెన్సులు 
వ్యాపారాల స్వభావాన్ని బట్టి డేంజరస్‌ అండ్‌ అఫెన్సివ్‌(ప్రమాదకర, ఉపద్రవ), సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలు, పారిశ్రామిక సముదాయాలు, తాత్కాలిక వ్యాపారాలు అనే నాలుగు కేటగిరీలుగా విభజించి ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేయనున్నారు. ట్రేడ్‌ లైసెన్సు లేకుండా మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి వ్యాపారాలు నిర్వహిం చడానికి వీలులేదని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాపారాలు/పరిశ్రమల నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులతోపాటు లైసెన్సు ఫీజు చెల్లించిన తర్వాతే లైసెన్సులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించింది.

ప్రాంతం ప్రాధాన్యత, విస్తీర్ణం ఆధారంగా లైసెన్సుల జారీకి ప్రభుత్వం రేట్లను నిర్ణయించింది. ప్రమాదకర వ్యాపారాలతోపాటు సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలకు సింగిల్‌ లైన్‌ రోడ్డు ఉంటే ప్రతి చదరపు అడుగుకు కనీసం రూ.3, డబుల్‌లైన్‌ ప్రాంతంలో కనీసం రూ.4, మల్టీలైన్‌ రోడ్డు ఉంటే కనీసం రూ.5 చొప్పున మొత్తం ప్రాంతం విస్తీర్ణానికి లెక్కించి లైసెన్సుఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నక్షత్రాల హోటళ్లు, కార్పొరేట్‌ ఆస్పత్రులు చదరపు అడుగుకు కనీసం రూ.6 చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉండనుంది. పరిశ్రమల స్థాయిని బట్టి కనీసం రూ.4 నుంచి రూ.7 వరకు ప్రతి చదరపు అడుగు స్థలానికి చెల్లించాల్సి ఉంటుంది.

కౌన్సిళ్లు నిర్ణయించాలి..
ఇక తాత్కాలిక వ్యాపారాల కోసం వసూలు చేసే లైసెన్సు ఫీజులను స్థానిక మున్సిపల్‌ కౌన్సిళ్లు నిర్ణయించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి మూడేళ్లకోసారి మున్సిపల్‌ కౌన్సిళ్లు ట్రేడ్‌లైసెన్సు ఫీజులను పెంచాలని, ఒకవేళ మున్సిపల్‌ కౌన్సిళ్లు పెంచకపోతే జిల్లా కలెక్టర్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.    

మరిన్ని వార్తలు