Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు

12 Oct, 2022 16:02 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆరు నూరైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బుల పంపిణీ జోరందుకుంది. మద్యం విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి.

కుల, మహిళా, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అడిగినంత ముట్టచెబుతున్నాయి. మరోవైపు విందులు, వినోదాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఇస్తున్న తాయిలాలు ఓటర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ఖర్చు రూ.150 కోట్లు దాటిందని ఓ సర్వే లెక్క కట్టింది. అయితే ధన ప్రవాహాన్ని అదుపు చేయాల్సిన ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

బతుకమ్మ పండగకు భారీ ఖర్చు
ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి బతుకమ్మ పండగ కోసం మహిళలను సమీకరించారు. చౌటుప్పల్, మునుగోడులో జరిగిన బతుకమ్మ పండగ కోసం వచ్చిన మహిళలు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించారు. ఒక్కో చోట సుమారు 4 వేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించారు. మున్సిపాలిటీలు, మండలాల్లో టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రతి చోట సుమారు 8వేల మందికి విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేశారు. చండూరులో నామినేషన్‌ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రూ.500, బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్‌ లిక్కర్‌ కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఇలా ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీలు చేరో రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు రాజకీయ పరిశీలకుల అంచనా.

నామమాత్రంగా ఎన్నికల పరిశీలకులు 
ఎన్నికల కమిషన్‌ పరిశీలకులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని, కోట్లలో డబ్బు ఖర్చు అవుతున్నా ఎక్కడా పట్టుకున్న జాడలు కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మొక్కుబడిగా లెక్కలు రాస్తున్నారని విమర్శిస్తున్నారు.  

రూ. కోట్లలో మద్యం అమ్మకాలు
ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రూ. కోట్లల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట మండలాల్లోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ 10 వరకు రూ.44,54,01,197 కోట్ల లిక్కర్, బీర్ల అమ్మకాలు జరిగాయి. 

మీటింగులకే కోట్లలో ఖర్చు
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీల సభలకే కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. సెప్టెంబర్‌ 20న మునుగోడులో కేసీఆర్, 21 అమిత్‌షా సభల కోసం దాదాపు రూ.60 కోట్లకుపైగా ఖర్చయినట్లు సమాచారం.  అలాగే చేరికల కోసం ఒక్కో సర్పంచ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దసరా పండుగ రోజు నియోజవకర్గంలోని 298 బూత్‌లకు బీజేపీ ప్రతి బూత్‌కు రూ.20 నుంచి 20 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ ప్రతి బూత్‌కు రూ.10 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యే స్థాయినుంచి మంత్రి వరకు ఇన్‌చార్జ్‌ లను నియమించింది. అయితే ఒక్కొక్కరి వెంట 25 మంది నుంచి 30 మంది వచ్చి ఆ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. వీరికి భోజనాలు, రవాణ ఖర్చులు భారీగానే అవుతున్నాయి. కుల సంఘాల సమావేశాలకు అంచనాలకు మించి లక్షల్లో  ఖర్చు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలను మున్సిపాలిటీలు, మండలాల వారీగా లక్షలు ఖర్చు చేశారు. 

మరిన్ని వార్తలు