హుస్సేన్‌సాగర్‌లో భారీగా పెరిగిన కాలుష్యం 

27 Sep, 2022 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నిమజ్జనంతో హుస్సేన్‌ సాగర్‌లో కాలుష్యం అనూహ్యంగా పెరిగినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత రోజుల్లో సాగర్‌ నీటి నమూనాలను సేకరించి.. పరీక్షించగా పలు ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. నీటి రంగు, బురద రేణువులు, కరిగిన ఘన పదార్థాలు, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, భార లోహాల మోతాదు పరిమితికి మించి పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. నిమజ్జనానికి ముందు ఆగస్టు 29 తోపాటు నిమజ్జనం జరిగిన తేదీలు సెప్టెంబరు 2,5, 7, 9 తేదీలలో.. నిమజ్జనం అనంతరం సెప్టెంబరు 12న పీసీబీ నిపుణులు.. ఎన్‌టీఆర్‌పార్క్, లుంబినీ పార్క్, నెక్లెస్‌ రోడ్, లేపాక్షి పాయింట్, సాగరం మధ్యనున్న బుద్ధవిగ్రహంవద్ద నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. 

అన్ని పాయింట్ల వద్దా కాలుష్యమే.. 
నిమజ్జనంతో పీసీబీ సేకరించిన అన్ని పాయింట్ల వద్ద కాలుష్య మోతాదు భారీగా పెరిగినట్లు గుర్తించారు. ఎన్‌టీఆర్‌ పార్క్‌ నిమజ్జనానికి ముందు  సరాసరిన లీటరు నీటిలో బురద రేణువుల మోతాదు 45 మిల్లీగ్రాములుండగా.. అనంతరం ఏకంగా 152 మిల్లీ గ్రాములకు చేరింది. నీటి గాఢత కూడా 7.24 పాయింట్లుగా నమోదైంది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 712 మిల్లీగ్రాముల నుంచి 848 మిల్లీగ్రాములకు పెరిగింది. కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 37 మిల్లీగ్రాములుండగా.. నిమజ్జనం తర్వాత ఏకంగా 164 మిల్లీగ్రాములకు చేరింది. బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 10 మిల్లీగ్రాముల నుంచి 30 మి.గ్రా మేర పెరిగింది. భార లోహాలు క్రోమియం, లెడ్, జింక్, కాపర్, క్యాడ్మియం తదితరాల మోతాదు కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 

లుంబినీ పార్క్‌ వద్ద: నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. బురద రేణువుల మోతాదు అత్యధికంగా 1340 మి.గ్రా నమోదైంది. గాఢత 8.12 పాయింట్లకు చేరింది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 831 మి.గ్రా నమోదైంది. కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 284 మిల్లీగ్రాములుగా.. నీటి కాఠిన్యత మి.గ్రాములకు చేరింది. నెక్లెస్‌రోడ్‌ వద్ద: బురద రేణువులు 112 మి.గ్రాములకు చేరువయ్యాయి. గాఢత 8.24 పాయింట్లుగా ఉంది. కరిగిన ఘన పదార్థాలు 829 మిల్లీగ్రాములుగా ఉన్నాయి. ఈ–కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి.

కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 160 మిల్లీగ్రాములుగా ఉంది. నీటి కాఠిన్యత 404 మి.గ్రాములకు చేరింది. లేపాక్షి: బురద రేణువులు 100 మి.గ్రాములకు చేరాయి. నీటి గాఢత 8.50 పాయింట్లకు చేరింది.కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 126 మిల్లీగ్రాములుగా ఉంది. కాఠిన్యత 326 మి.గ్రా ఉంది.  బుద్ధ విగ్రహం వద్ద: బురద రేణువులు 96 మి.గ్రా నమోదయ్యాయి. కరిగిన ఘన పదార్థాలు 832 మి.గ్రా ఉన్నాయి. కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 101 మి.గ్రా..  కాఠిన్యత 426 మి.గ్రా ఉంది. బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 24 మిల్లీగ్రాములుగా ఉంది.

అనర్థాలివే.. 
► సాగర్‌లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. 
► పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. 
► సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. 
► వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్‌లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. 
► జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. 

మరిన్ని వార్తలు