యాదాద్రి అతలాకుతలం

5 May, 2022 05:18 IST|Sakshi
కొండపైన క్యూలైన్‌ పక్కన నిలిచిన వర్షపునీరు

కొండపై ప్రధానాలయం, మండపాలు, క్యూకాంప్లెక్స్‌లోకి వాన నీళ్లు 

కూలిన చలువ పందిళ్లు, టెంట్లు, విద్యుత్‌ దీపాలు 

కుంగిపోయిన మూడో ఘాట్‌ రోడ్డు ముందు భాగం 

మొదటి ఘాట్‌రోడ్డు వద్ద బురదలో కూరుకుపోయిన బస్సులు 

దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరిస్తాం: దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ 

కొండపై అదనంగా ‘గంటకు వంద’పార్కింగ్‌ ఫీజును రద్దు చేస్తున్నట్టు వెల్లడి 

సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట రూరల్‌: ఆలయ ఉద్ఘాటన తర్వాత తొలిసారిగా కురిసిన భారీ వర్షంతో యాదాద్రి క్షేత్రం అతలాకుతలమైంది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గంటన్నరపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఘాట్‌రోడ్ల వద్ద మట్టి కుంగింది. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్, పరిసర ప్రాంతాల్లో నీరు చేరింది. దీనితో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఇంజనీరింగ్‌ లోపాలు, నాసిరకం పనుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 

కుంగిన ఘాట్‌ రోడ్డు.. కూరుకుపోయిన బస్సులు.. 
కొత్తగా నిర్మించిన మూడో ఘాట్‌రోడ్డు ప్రారంభంలో వాననీటి ధాటికి కుంగిపోయి పెద్ద గొయ్యి పడింది. దీనితో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. రెండోఘాట్‌ రోడ్డుకు అనుబంధంగా వీఐపీల కోసం నిర్మించిన ఈ ఘాట్‌రోడ్డును ఆలయ ఉద్ఘాటనకు కొద్దిరోజుల ముందే ప్రారంభించడం గమనార్హం. సీఎం కేసీఆర్‌తోపాటు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నుంచి వచ్చే ప్రముఖులు, ఆర్టీసీ బస్సుల కోసం మాత్రమే ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఇక వాననీటి ధాటికి మట్టికొట్టుకు వచ్చి మొదటి ఘాట్‌రోడ్డు బురద మయంగా మారింది. ఉదయం కొండపైకి భక్తులతో వెళ్తున్న రెండు బస్సులు ఈ బురదలో దిగబడ్డాయి. భక్తులే దిగి బస్సులను బురదలోంచి తోశారు. బస్సులు కూరుకుపోవడంతో కొండపైకి వెళ్లే ఇతర బస్సులూ ఆగిపోయాయి. చాలామంది భక్తులు మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. రింగ్‌రోడ్డులో యాద గిరిపల్లి సమీపంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఎదుట నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. 
కొండ కింద మూడవ ఘాట్‌ రోడ్డు వద్ద కొట్టుకుపోయిన రోడ్డు  

ప్రధానాలయంలోకీ నీరు 
ప్రధానాలయంలో పంచతల రాజగోపురం నుంచి ధ్వజ స్తంభం వరకు వాన నీరు చేరింది. దేవస్థానం సిబ్బంది బకెట్లతో నీటిని తొలగించి శుభ్రం చేశారు. ఇందుకోసం గంటకుపైగా దర్శనాలు నిలిపివేశారు. అష్టభుజి మండపాలు, ప్రాకార మండపాలు, లిఫ్ట్‌ మార్గంలో పలుచోట్ల వాన నీరు లీకైంది. కొండపై బస్టాండు పక్కన క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల గదుల్లో నీళ్లు నిలిచాయి. లడ్డూలు తడిసిపోయినట్టు సిబ్బంది పేర్కొన్నారు. భక్తులు ఇబ్బందిపడుతూనే దర్శనాలకు వెళ్లారు. క్యూకాంప్లెక్స్‌ పక్కన కార్యాలయంలో ఉన్న సామగ్రి, కంప్యూటర్‌లు, స్టోరేజీ రూమ్‌ జలమయం అయ్యా యి. ప్రధానాలయం బయట వాన నీరు నిండి చిన్నపాటి చెరువును తలపించింది. బంగారు వర్ణంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్‌లు కూలిపడ్డాయి. కొండపై బస్టాండ్, శివాలయం, ఇతర చోట్ల ఏర్పా టు చేసిన చలువ పందిళ్లు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. కొండ కింద వాహన పూజలు నిర్వహించేచోట భారీ వేప చెట్టు విరిగిపడింది. 

వెంటనే పునరుద్ధరిస్తాం: దేవాదాయ కమిషనర్‌ 
భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ఇతర పనులను వెంటనే పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ చెప్పారు. బుధవారం ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించి.. కూలిన పందిళ్లు, వాననీటి లీకేజీలు, ఇతర నష్టాలను పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడతామని.. కొండపై పార్కింగ్‌ ఫీజులో అదనంగా గంటకు రూ.100 వసూలును భక్తుల కోరిక మేరకు తొలగిస్తున్నట్టు ప్రకటించారు. 

కుండపోత పడితే ఎలా? 
‘ఇంజనీరింగ్‌’ నిర్లక్ష్యంతోనే సమస్య అనే ఆరోపణలు 
తాజా వానతో యాదాద్రి క్షేత్రంలో రోడ్లు దెబ్బతినడం, ఎక్కడిక్కడ నీళ్లు నిలవడం, ఆలయంలోకీ నీరు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్‌ రూ.1,300 కోట్ల వరకు ఖర్చుచేసి పునర్నిర్మాణం చేపట్టినా.. ఇంజనీరింగ్‌ లోపాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండపైన, దిగువన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకుండానే ఆలయ ఉద్ఘాటన చేసిన విషయం తెలిసిందే. ప్రధానాలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మాణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వపరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని.. కాంట్రాక్టు సంస్థల సైట్‌ ఇంజనీర్లతోనే పనులన్నీ చేపట్టారని అధికారవర్గాలు చెప్తున్నాయి.

వైటీడీఏ, సీఎంవో కార్యాలయం, దేవస్థానం ఉన్నతాధికారుల అండదండలతోనే సదరు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పను లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండ చుట్టూ నిర్మాణాలు చేస్తున్నప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారని.. వర్షాలు పడినప్పుడు ఎటు నుంచి నీరు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించలేక ఇలా రోడ్డు కోతపడిందని అధికారవర్గాలు అంటున్నాయి. ఈ వానకే ఇంత నష్టం జరిగితే.. కుండపోత వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు