‘పోడు’ పట్టాల కోసం గిరిజనేతర రైతుల పోరు

9 Nov, 2021 02:10 IST|Sakshi
మూడుకొట్ల సెంటర్‌లో ధర్నా చేస్తున్న గిరిజనేతర పోడు రైతులు   

మహబూబాబాద్‌లో భారీర్యాలీ 

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు  

సాక్షి, మహబూబాబాద్‌: గిరిజనేతర పోడు రైతులు కూడా కదంతొక్కారు. వందల ఏళ్లుగా అడవితో, గిరిజనులతో మమేకమైన తమను అటవీభూములకు దూరం చేయొద్దంటూ ఏకమయ్యారు. తమ పోడుభూములకు కూడా పట్టాలివ్వాలంటూ పోరుబాట పట్టారు. సోమవారం భారీగా తరలివచ్చి మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వేలాదిమంది గిరిజనేతర రైతులు ట్రాక్టర్లు, డీసీఎంల్లో జిల్లా కేంద్రానికి తరలివచ్చారు.

కలెక్టరేట్‌ ముట్టడికిగాను మూడుకొట్ల సెంటర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రైతులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు 20 మందిని పోలీసులు అనుమతించారు. ఈ మేరకు రైతులు అదనపు కలెక్టర్‌ కొమురయ్యను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఖాసీం, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు పీరయ్య మాట్లాడుతూ వందల ఏళ్ల క్రితమే ఏజెన్సీ ప్రాంత గిరిజనులతో సమానంగా గిరిజనేతరులు పోడు చేసుకుని జీవిస్తున్నారని అన్నారు.

వీరికి కూడా గిరిజనులతో సమానంగా పోడుపట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పొంతనలేని నిబంధనలు పెట్టి గిరిజనేతరులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరులకు పోడుపట్టాలు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజనేతర రైతు పోరాట సమితి నాయకులు, ఏజెన్సీ మండలాల్లోని ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు