ఇంగ్లిష్‌ .. ఫుల్‌ జోష్‌! 

21 Jun, 2022 01:01 IST|Sakshi

ఇంగ్లిష్‌ మీడియంపై విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం 

ప్రభుత్వ స్కూళ్లలో భారీ సంఖ్యలో చేరికలు 

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులే ఎక్కువ 

మూతబడిన స్కూళ్లు సైతం తెరుచుకుంటున్న వైనం 

తొలి ఏడాది కావడంతో సన్నద్ధతపై సందేహాలు 

టీచర్లను సుశిక్షితుల్ని చేయాలంటున్న నిపుణులు

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘నాక్కూడా ప్రైవేటు బడిలో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవాలని ఉండేది. కానీ నాన్న ఆకస్మికంగా చనిపోవటం, అమ్మకు నన్ను ప్రైవేటు బడికి పంపే స్తోమత లేకపోవడంతో మా సీతారాంకుంట తండా ప్రభుత్వ బడిలో ఐదవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నా. కానీ ఈ ఏడాది మా మారేపల్లి స్కూల్లో ఇంగ్లిష్‌ మీడియం పెట్టగానే అక్కడ చేరా. ఇంగ్లిష్‌ మీడియంలో కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సంపాదించి అమ్మకు గిఫ్ట్‌గా ఇస్తా..’అని సంగారెడ్డి జిల్లా మారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరిన అపర్ణ అనందంతో చెప్పిన మాటలివి. ఒక్క అపర్ణే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న సుమారు పదకొండున్నర లక్షల మంది నిరుపేద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 

మూతపడిన స్కూళ్లు మళ్లీ కళకళ 
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతూ క్లాసులు మొదలవటంతో మెజారిటీ విద్యార్థులు తెలుగు మీడియం నుండి ఇంగ్లిష్‌ మీడియానికి (1 నుండి 8వ తరగతి వరకు) మారిపోతున్నారు. ఇక కొత్తగా ఒకటవ తరగతిలో చేరే వారు నూటికి నూరుశాతం ఇంగ్లిష్‌నే ఎంచుకుంటున్నారు. ఉమ్మడి పది జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ క్రమంలో గతంలో విద్యార్థులు లేక మూతపడ్డ పాఠశాలలు సైతం ఈ మారు తెరుచుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేశారం పాఠశాల విద్యార్థులు లేక మూతపడగా, ప్రస్తుతం ఇంగ్లిష్‌ విద్యాబోధనకు సిద్ధం చేయటంతో 25 మంది విద్యార్థులు ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చేరారు. దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే వెనుకబడిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పేద విద్యార్థులు భారీ సంఖ్యలో ఇంగ్లిష్‌ మీడియం వైపు ఆకర్షితులవుతుండటం గమనార్హం.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో చేరికలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లో తెలుగు మీడియం కన్నా రెట్టింపు సంఖ్యలో ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులున్నారు. దక్షిణ తెలం గాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో మాత్రం తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. 

సమస్యలు అధిగమిస్తే సక్సెస్సే.. 
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశాలకు మంచి స్పందన కనిపిస్తున్నా, తొలి ఏడాదిలో ఉపాధ్యాయుల సన్నద్ధత, పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల్లో మన ఊరు మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులు పదిశాతం కూడా పూర్తి కాకపోవటం, ఇప్పటికీ 25 శాతమే పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రావటం వంటి అంశాలు ప్రతి బంధకాలుగా మారాయి. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సహకారంతో ఉపాధ్యాయులకు ఆఫ్‌లైన్‌ –ఆన్‌లైన్‌లో ఇంగ్లిష్‌ బోధనపై బ్రిడ్జికోర్సు, ఇతర శిక్షణలు నిర్వహించినా ఉపాధ్యాయుల సన్నద్ధతపై ఇంకా కొంత సందిగ్ధత ఉంది.

ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉపాధ్యాయులను ఇంగ్లిష్‌ బోధనలో సుశిక్షితులుగా చేయటంపై ప్రభుత్వం దృష్టి సారించి, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయటంతో పాటు బై లింగ్వల్‌ (ఇంగ్లిష్‌ –తెలుగు ద్విభాషల్లో)లో రూపొందించిన పాఠ్య పుస్తకాలు వీలైనంత త్వరగా సరఫరా చేయగలిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో ‘నాడు – నేడు’విజయవంతమైనట్టే తెలంగాణలో ‘మన ఊరు–మన బడి’విజయవంతం అవుతుందని విద్యారంగ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

తిరిగి తెరుచుకున్న స్కూళ్లివే.. 
► నాలుగేళ్ల క్రితం మూతపడిన నిజామాబాద్‌ జిల్లా కేశా రం పాఠశాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు పాఠశాలలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కొము రం భీం జిల్లాలో పన్నెండు, ఆసిఫాబాద్‌లో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది విద్యార్థులతో నిండాయి. కొమురం భీం జిల్లా కోయగూడ ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్ల తర్వాత 15 మంది విద్యార్థులు చేరారు.  
► ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 22 స్కూళ్లు తెరుచుకున్నా యి. మళ్లీ ప్రారంభం అవుతున్న పాఠశాలల్లో అత్యధి కం గిరిజన తండాల్లోనే ఉన్నాయి. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 17 పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. 

శిక్షణ ఇచ్చేందుకు ఇఫ్లూ రెడీ 
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చేందుకు, మెళకువలు నేర్పేందుకు ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) సిద్ధంగా ఉంది. దేశంలో ఇంగ్లిష్‌ భాష విస్తరణే లక్ష్యంగా 1958లో ఏర్పడిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (సీఫెల్‌) ఇప్పుడు ఇఫ్లూగా స్థిరపడింది. ఇఫ్లూ ప్రస్తుతం 105 దేశాల రాయబారులు, ఇతర ముఖ్యులకు ఇంగ్లిష్‌లో మెళకువలు నేర్పుతోంది. అలాగే తెలంగాణ రేపటి భవిష్యత్తు కోసం ఏం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. 
– సురేశ్‌కుమార్, వైస్‌ చాన్స్‌లర్, ఇఫ్లూ 

ఆత్మగౌరవంతో బతకడానికి..
ఇంగ్లిష్‌ అనేది ప్రపంచంలో మన వాళ్లు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది. అందుకే సర్కారు బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలని నేను చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నా. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు నాడు –నేడు పేరుతో పాఠశాల విద్యను ఆధునీకరించి బలోపేతం చేశారు. తెలంగాణలోనూ ఓట్ల పథకంలా కాకుండా నిజాయితీగా ఇంగ్లిష్‌ మీడియంను ముందుకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొందరికే లబ్ధి చేకూర్చే దళితబంధు లాంటి పథకాలు ఎత్తేసి దళితులు, బలహీనవర్గాలకు అన్నివిధాలా మేలు చేసే విద్య కోసం నిధులు కేటాయించాలి. నా వంతు చేయూతగా యూట్యూబ్‌లో ఇంగ్లిష్‌ క్లాస్‌లు అందుబాటులోకి తేబోతున్నా. 
– ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య 

ఇంటి వద్దే ఇంగ్లిష్‌ పాఠాలు.. 
ఇంగ్లిష్‌ మీడియం కోసం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు కొత్తగా మా పాఠశాలకు వస్తున్నవారంతా ఇంగ్లిష్‌ మీడియాన్నే ఎంచుకుంటున్నారు.     
– బిందుశ్రీ, టీచర్, ఆదిలాబాద్‌  

ఇంటి వద్దే ఇంగ్లిష్‌ పాఠాలు.. 
నేను ఇంతకు ముందు ఆటోలో పక్క గ్రామానికి వెళ్లేవాడిని. ఇప్పుడు మా ఇంటి వద్ద స్కూల్లోనే ఇంగ్లిష్‌ పాఠాలు చెబుతున్నారు. దీంతో నేను ఇంగ్లిష్‌ మీడియంలో ఐదో తరగతిలో చేరా.     
– బి.శివ, కేశారం, నిజామాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు