Banjara Hills: ట్రాఫిక్‌ దిగ్బంధంలో విరించి చౌరస్తా.. అదే సమస్యకు పరిష్కారం..

13 Feb, 2023 12:54 IST|Sakshi
 విరించి ఆస్పత్రి చౌరస్తాలో స్తంభించిన ట్రాఫిక్‌.... 

సాక్షి, బంజారాహిల్స్‌: అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించరు... పాదచారులు రోడ్డు దాటేందుకు  వంతెనలు ఉండవు.. ఇష్టానుసారంగా కూడళ్లలో రాకపోకలు... ఫలితంగా వాహనదారులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. గంటల తరబడి కూడళ్లలో సిగ్నళ్ల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగించే బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తాలో గడిచిన నాలుగు దశాబ్ధాలుగా ట్రాఫిక్‌ ఇక్కట్ల నుంచి స్థానికులకు విముక్తి లభించడం లేదు.

అదే రోడ్డు.. అదే చౌరస్తా... ఏ మాత్రం విస్తరణకు నోచుకోని ఈ కూడలిలో వాహనదారులే కాదు రోడ్డు దాటేందుకు పాదచారులు అవస్థలు పడుతున్నారు. మాసబ్‌ ట్యాంకు వైపు నుంచి పోలీస్‌ మెస్‌ చౌరస్తా, 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తా దాటి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12 వైపు, కేర్‌ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇక్కడ ఇరుకైన రోడ్డుతో పాటు అడుగడుగునా పాదచారులు రోడ్డుదాటుతుండటంతో వాహనాల రాకపోకలు ముందుకు సాగడం లేదు. కేర్‌ ఆస్పత్రి వైపు నుంచి మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12, రోడ్‌ నెం. 13 వైపు వెళ్లే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తుంది. వాహనాలు కేర్‌ ఆస్పత్రి నుంచి మొదలుకొని 1/12 చౌరస్తా వరకు స్తంభించిపోయి మాసబ్‌ట్యాంకు వైపు వెళ్ళడమే గగనంగా మారుతోంది.  

పరిష్కారమిదీ...  
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 1/12 విరించి చౌరస్తాలో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే అందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. ఈ చౌరస్తాలో తప్పనిసరిగా ఫ్లై ఓవర్‌ నిర్మాణంతో పాటు పాదచారుల వంతెన కూడా అవసరం. 

పింఛన్‌ ఆఫీస్‌ వైపు నుంచి దారి మూసివేత... 
మాసబ్‌ట్యాంకు వైపు నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12 వైపు వెళ్లే మలుపు వద్ద శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉండగా ఈ ఆలయం వెనుక నుంచి పింఛన్‌ ఆఫీస్‌ గేటు లోపల గతంలో ఓ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందనుకునేలోగా కొందరు అడ్డుపడటంతో ఈ దారిని బండరాళ్లు వేసి మూసివేశారు.

గత పదేళ్లుగా ఈ సమస్యను పట్టించుకునే వారే లేరు. గుడి వెనుక దారి ఏర్పాటు చేస్తే మాసబ్‌ ట్యాంక్‌ వైపు నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12 వైపు వెళ్లేవారు తేలికగా ఫ్రీ లెఫ్ట్‌లో ముందుకు సాగుతారు. దీని వల్ల చాలా వరకు ఈ కూడలిపై ట్రాఫిక్‌ భారం తగ్గుతుంది. 

ప్రణాళికలేవీ..?  
మాసబ్‌ ట్యాంకు వైపు నుంచి పోలీస్‌ మెస్‌ చౌరస్తా, 1/12 చౌరస్తాల మీదుగా కేర్‌ ఆస్పత్రి దాకా ఓ ఫ్లై ఓవర్‌ నిర్మించాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ రోడ్డు విస్తరణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుట్‌పాత్‌లు కూడా అందుబాటులో లేవు. గజిబిజి ట్రాఫిక్‌ మధ్య అక్రమ పార్కింగ్‌లు పెద్ద సమస్యగా మారాయి. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.  

మరిన్ని వార్తలు