కరోనా వల్ల మేలెంత? కీడెంత?

3 Jan, 2021 10:05 IST|Sakshi

కుటుంబ సభ్యులతో సంబంధాలు, బంధుత్వాలు మెరుగు

ప్రకృతితో మమేకం, ఆరోగ్యంపైనా శ్రద్ధ పెరుగుదల 

యూ గవ్‌–మింట్‌–సీపీఆర్‌ మిల్లీనియల్‌ తాజా సర్వేలో 

ఆసక్తికర అంశాల వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి ముమ్మాటికీ మా‘నవ’సంబంధాలను ప్రభావితం చేసింది. కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు, అనుబంధాలు చిక్కగా మారాయి. ఆరోగ్యంపై చక్కటి అవగాహన ఏర్పడింది. కరోనా వైరస్‌ కట్టడికి 9 నెలల క్రితం దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ చాలామార్పులకు కారణమైంది. కొన్ని సానుకూల, మరికొన్ని ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యంపై ధ్యాస చాలావరకు మెరుగుపడినట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహమ్మారి కారణంగా ఎదురైన అనుభవాలు, అధిగమించిన విపత్కర పరిస్థితులు, వాటిని ఎదుర్కోవడంలో ఆదాయం, వయసు, జెండర్‌ (లింగ భేదం) వంటివి ఎలాంటి పాత్రను షోషించాయన్న దానిపై యూ గవ్‌–మింట్‌–సీపీఆర్‌ మిల్లెనీయల్‌ తాజాగా సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 203 నగరాలు, పట్టణాల్లోని పదివేల మంది నుంచి వివిధ అంశాలపై సమాధానాలు రాబట్టింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.  

ఏది ఎక్కువగా మిస్సయ్యారంటే..
ఆప్తమిత్రులు, కుటుంబసభ్యులను కలుసుకోలేక పోతున్నామన్న వారు 57 శాతం 
బయట రెస్టారెంట్లు, హోటల్‌కు వెళ్లి తినలేకపోతున్నామన్న వారు 55 శాతం 
సెలవుల్లో టూరిస్ట్‌ సైట్లు, కొత్త ప్రదేశాలకు వెళ్లలేకపోతున్నామన్న వారు 54 శాతం 
ఆఫీసులు, కాలేజీలు, వర్క్‌పై క్యాంప్‌లకు వెళ్లడాన్ని మిస్‌ అవుతున్నామన్న వారు 53 శాతం 
కాన్సర్ట్‌లు, మ్యూజిక్, లైవ్‌ ఈవెంట్లు, నాటకాలు చూడలేకపోతున్నామన్న వారు 49 శాతం

కష్టంగా వర్క్‌ఫ్రం హోం

  • ఈ విధానం వల్ల పనిభారం పెరిగిందన్న వారు 81 శాతం 
  • ఆఫీసు పని, ఇంటి పనులు బ్యాలెన్స్‌ చేయడం కష్టంగా మారిందన్నవారు 60 శాతం 
  • తమ కెరీర్‌ వెనక్కి పోయిందన్న వారు 57 శాతం 
  • కొలీగ్స్‌తో కలసి పనిచేయలేకపోవడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వారు 55 శాతం 
  • పనిని ఎంజాయ్‌ చేయలేకపోతున్నామన్నవారు 55 శాతం 
  • ఇంటి సభ్యుల నుంచి డిస్టర్‌బెన్స్‌ ఉందంటున్నవారు 48 శాతం 

కుటుంబం, ఆరోగ్యం విషయంలో... 

  • లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులతో సంబంధాలు మెరుగుపడ్డాయన్న వారు 62 శాతం 
  • ప్రకృతితో మమేకం కావడానికి అవకాశం పెరిగిందన్న వారు 61 శాతం 
  • ఆరోగ్యంపట్ల ధ్యాస పెరిగి, దాని పరిరక్షణపై చర్యలు చేపట్టామన్న వారు 60 శాతం 
  • భక్తి భావనలు పెరిగాయన్న వారు 41 శాతం 
  • ఆఫీసుల్లో బాస్‌లతో స్నేహభావం, కొలిగ్స్‌తో సంబంధాలు పెరిగాయన్నవారు 34 శాతం 
  • ఆఫీసులు, కాలేజీలను మిస్‌ అవుతున్నామంటున్నవారు 40 శాతం 
మరిన్ని వార్తలు