‘మానవ రవాణా’.. ఆగేనా? అవయవాలు మాయం.. భిక్షాటన.. బలవంతపు పెళ్లిళ్లు

29 Mar, 2023 16:04 IST|Sakshi

ఎల్లలు దాటుతున్న మానవఅక్రమ రవాణా ముఠాల ఆగడాలు

బాధితుల్లో మహిళలు, యువతులు, పిల్లలు, పురుషులు.. దేశ సరిహద్దులు సైతం దాటిస్తున్న మాఫియా

కూలీలు, వ్యభిచారులుగా మారుస్తున్న వైనం

మాట వినకుంటే మహిళలు, యువతులపై భౌతిక దాడులు.. దేశంలో ఏడాదిలో 27.7% పెరిగిన కేసులు

141 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా యూఎన్‌ఓడీసీ నివేదిక 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : మావన అక్రమ రవాణా..భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఓ పెద్ద సమస్య. మహిళలు, యువతులు, పిల్లలే కాదు.. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారు. తమ వలలో చిక్కుతున్న వారిని మాఫియా ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైతే, వీలైతే దేశాలను సైతం దాటించేస్తోంది.

మహిళలు, యువతులను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతోంది. లొంగని వారిపై భౌతిక దాడులు చేస్తోంది. పలు రకాలుగా హింసిస్తోంది. పురుషులు, పిల్లలకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ బానిసలుగా మార్చేస్తోంది. కూలీలుగా పని చేయించడం, వ్యభిచారం చేయించడం, ఈ రెండింటికీ వినియోగించడం లాంటి వాటికి ఈ మాఫియా తెగబడుతోంది. బలవంతపు పెళ్లిళ్లు చేయడంతో పాటు భిక్షాటన కూడా చేయిస్తోంది. బాధితుల అవయవాలు వారికి తెలియకుండా దొంగిలించడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది.

మోసాలు, ఆర్థిక అసమానతలు..
ఎక్కువగా.. చదువు, అవగాహన లేకపోవడం వల్ల మోసాలకు గురవుతున్నవారు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, ఉద్యోగాలు, ఉత్తమ జీవన ప్రమాణాల పేరిట మాఫియా ప్రలోభాలకు లొంగిపోతున్నవారు మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అసమానతలు దీనికి కారణమవుతున్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన మాదకద్రవ్యాలు, నేరాల సంబంధిత కార్యాలయం (యూఎన్‌ఓడీసీ) నివేదిక స్పష్టం చేసింది. 95 శాతం ప్రపంచ జనాభా ఉండే 141 దేశాల నుంచి సేకరించిన డేటా ప్రకారం యూఎన్‌ఓడీసీ ఈ నివేదిక రూపొందించింది.

శిక్షల శాతం తగ్గుతోంది..
చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదని అందుకే అక్రమ రవాణా చేసే మాఫియాకు పడే శిక్షలు తగ్గుతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. 2017 నుంచి ఈ శిక్షలు పడే శాతం తగ్గుతూ వచ్చిందని వెల్లడించింది.

గత సంవత్సరంలో న్యాయస్థానాలు విధించే శిక్షలు ఏకంగా 27% తగ్గినట్లు పేర్కొంది. అంతర్జాతీయంగా 27% తగ్గుదల ఉంటే.. దక్షిణాసియాలో 56 శాతం, మధ్య అమెరికాలో 54 శాతం, దక్షిణ అమెరికాలో 46 శాతం తగ్గినట్లు పేర్కొంది.

ఒక్కసారి చిక్కితే జీవితాలు నాశనమే
ప్రపంచ జనాభాలో 95 శాతం ఉండే 141 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా యూఎన్‌ఓడీసీ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం చూస్తే...మానవ అక్రమ రవాణాలో ఇప్పటికీ మహిళలు, యువతుల శాతమే అధికంగా ఉంటోంది. మాఫియా చేతుల్లో ఎక్కువ హింసకు గురవుతున్నదీ వీరే కావడం గమనార్హం. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది.

భారతదేశంలోనూ మానవ అక్రమ రవాణా పెద్ద సంఖ్యలో జరుగుతోందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముఠాలకు ఒక్కసారి చిక్కితే బయటపడడం అంత సులువు కాదు. తప్పించుకుని పోవడానికి వీల్లేకుండా భౌతిక, మానసిక హింసకు గురి చేస్తారు. ఇది తీవ్రమైన సమస్య అయినా భారత ప్రభుత్వం స్పందన ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలున్నాయి. 

2021లో 6,533 కేసులు 
దేశంలో మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2020తో పోలిస్తే 2021లో 27.7% పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్రమ రవాణా ఆరోపణలతో మహిళలు 2020లో 1,714 ఫిర్యాదులు చేస్తే, 2021లో 2,189 నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. పిల్లలు, పెద్దల  అక్రమ రవాణాకు సంబంధించి 6,533 కేసులు నమోదు కాగా.. అందులో 18 సంవత్సరాల వయస్సులోపు వారు 2,877 కాగా, 3,656 మంది పెద్దవారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

కూలీలుగా 38.8 శాతం
మానవ అక్రమ రవాణాలో బలవంతంగా కూలీలు మారేవారి సంఖ్య 38.8 శాతం ఉండగా, వ్యభిచారంలోకి 38.7 శాతం మంది నెట్టబడుతున్నారు. ఈ రెండింటికీ వినియోగించేలా 10.3 శాతం, బలవంతపు పెళ్లిళ్లు 0.9 శాతం, యాచకవృత్తిలోకి 0.7, దత్తత కోసం 0.3 శాతం, అవయవాల దొంగతనం 0.2 శాతం ఉన్నట్లు యూఎన్‌ఓడీసీ స్పష్టం చేస్తోంది. 

వాతావరణ మార్పులూ పరోక్షంగా దోహదం
వాతావరణ మార్పులూ పరోక్షంగా మానవ అక్రమ రవాణాకు దోహదపడుతున్నట్టు యూఎన్‌ఓడీసీ తన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే భారీ వరదల్లో సర్వం కోల్పోయిన వారు, కరువు కాటకాల్లో చిక్కుకున్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఈ ముఠాలకు చిక్కుతున్నారు.

ప్రభుత్వాలు దీనిపై దృష్టి కేంద్రీకరించని కారణంగానే ఈ దందా కొనసాగుతున్నట్లు నివేదిక తేల్చింది. కోర్టుల్లోనూ ఈ మాఫియాకు పెద్దగా శిక్షలు పడుతున్న దాఖలాల్లేవని, పడుతున్న శిక్షలే తక్కువ అంటే.. 2020లో ఈ శిక్షల సంఖ్య ఏకంగా 27% తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.

విద్య, మహిళా సాధికారతతో చెక్‌
విద్య, మహిళా సాధికారతతో మానవ అక్రమ రవాణకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. లింగ భేదం లేకుండా మహిళలు ఆర్థిక సాధికారత సాధించే విధంగా ప్రభుత్వ విధానాలు, కార్యాచరణ ఉంటే దీనికి అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

చట్టాలను, న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, చట్టాలు అమలు చేసే యంత్రాంగానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అంటున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు సైతం సంయుక్తంగా కృషి చేస్తేనే ఈ అమానవీయ పరిస్థితి నుంచి బయట పడడానికి వీలుంటుందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు