కిన్నెరసానిలో వందలకొద్దీ మకరాలు

10 Apr, 2021 20:47 IST|Sakshi

పాల్వంచరూరల్‌: ప్రకృతి అందాల నిలయమైన కిన్నెరసాని జలాశయంలో మొసళ్ల సంతతి అంతకంతకూ పెరుగుతూపోతోంది. రిజర్వాయర్‌లో ఒకవైపు బోటు షికారు జరుగుతుంటే ఇంకోవైపు చేపలు సంచరించినట్లుగానే మొసళ్లుకూడా ఈదుతూ కనిపిస్తుంటాయి. కిన్నెరసాని రిజర్వాయర్‌లో 1984లో నీళ్లు నిలకడగా ఉండే ప్రదేశంలో జీవించగలిగిన మగ్గర్‌ జాతికి చెందిన 22 ఆడ, 11 మగ మొసళ్లను వేశారు. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ..దాదాపు ఇప్పుడు 1000వరకు ఉండవచ్చని ఒక అంచనా. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలోని శిలారంలో 70కిపైగా, సంగారెడ్డిజిల్లా మంజీరా నదిలో వంద వరకు మొసళ్లు ఉంటాయి.

క్రొకోడైల్‌ వైల్డ్‌లైఫ్‌ సంచారీగా మార్చారు. కానీ..కిన్నెరసానిలో వందల సంఖ్యలో మొసళ్లు ఉన్నా..ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిన్నెరసాని కాల్వ సమీపంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు చెందిన పంప్‌హౌజ్‌ వద్ద మదుగులో మొసళ్లు సంచరిస్తున్నాయి. కిన్నెరసాని కరకట్ట దిగువభాగంలోని చెరువులోనూ ఇవి తిరుగుతున్నాయి. పర్యాటకుల బోటింగ్‌ షికారు కూడా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. 

బయటికి వస్తుండడంతో భయం..భయం
రిజర్వాయర్‌లో అధికంగా పెరిగిన మొసళ్లు, వాటి సంతతి క్రమంగా ఒడ్డుకు వచ్చి సమీపంలోని చెరువులు, చేల వద్దకు చేరుతున్నాయి. గతంలో పాల్వంచ పట్టణంలోని చింతలచెరువు సమీపంలో నల్లమల్ల వేణు అనే వ్యక్తి ఇంట్లోకి మొసలి వెళ్లగా పట్టుకున్నారు. యానంబైల్‌ గ్రామ సమీపంలోని చెరువు వద్ద మగితే రత్తమ్మ అనే మహిళపై దాడి చేసింది. ఒడ్డుకు వచ్చి చెట్ల పొదల్లో గుడ్లు పెడుతుంటాయి. అటుగా వెళ్లేవారిపై దాడులకు పాల్పడుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఎక్కడ మకరం పిల్లలు దొరికినా ఇక్కడి జలాశయంలోనే వదిలేస్తుండడంతో వీటి సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. ప్రాజెక్ట్‌ నుంచి గోదావరిలోకి నీటిని వదిలేప్పుడు పరీవాక ప్రాంతాల్లో మొసళ్లు సంచరిస్తున్నాయి. రంగాపురం, నాగారం. సూరారం, పాండురంగాపురం ప్రాంతాల్లో అనేకమార్లు వీటిని పట్టుకుని తిరిగి జలాల్లో వదిలేశారు.

మరిన్ని వార్తలు