నగర వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కరోనా

8 May, 2021 08:36 IST|Sakshi

కాలనీలు, ప్రధాన మార్గాల్లో వెలుస్తున్న మార్కెట్లు 

వీటిలో పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్న జనాలు

భౌతిక దూరం మాటే మరిచిన కొనుగోలుదారులు 

మహమ్మారితో ముప్పు ఉందనే హెచ్చరికలూ బేఖాతరు  

అపార్ట్‌మెంట్‌ వాసులు, కాలనీల ప్రజల్లో ఆందోళన       

సాక్షి, సిటీబ్యూరో: ఇది రామంతాపూర్‌లోని వివేకానగర్‌ కాలనీలో వెలసిన వారాంతపు సంత. జనం గుంపుల కొద్దీ పోగయ్యారు. తిరునాళ్లను తలపించారు. కూరగాయలు, ఇతర వస్తువుల కోసం గుంపులు గుంపులుగా కదులుతున్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్కెట్‌ రద్దీగా ఉంటుంది. కనీసం  వందకుపైగా తోపుడు బండ్లు, తాత్కాలిక స్టాళ్లు వెలుస్తాయి. ఈ మార్కెట్‌ చుట్టూ అన్నీ కాలనీలు, బస్తీలే. ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా జనం ఇలా ఒకేచోట చేరడం వల్ల మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తుందని అందరికీ తెలుసు. కానీ.. కోవిడ్‌ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క రామంతాపూర్‌లోనే కాదు. నగరంలోని ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక చోట వారాంతపు మార్కెట్లు ఏర్పాటవుతున్నాయి. ఈ సంతలతో కరోనా ముప్పు భారీగా ఉంటుందని కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

భౌతిక దూరమా.. అదెక్కడ..?
సాధారణ రోజుల్లో అయితే ఇళ్ల ముందుకే మార్కెట్లు తరలిరావడం ఆహా్వనించదగిన పరిణామం. జనం తమకు కావాల్సిన వాటిని అక్కడికక్కడే కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల కోసం మహిళలకు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా  తమ కాలనీల్లో వారానికోసారి ఏర్పాటు చేసే మార్కెట్‌లో కొనుగోలు చేయడం ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ గత రెండు నెలలుగా  ఈ మార్కెట్లు కోవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అనేక చోట్ల వారాంతపు మార్కెట్లు పని చేస్తున్నాయి. సనత్‌నగర్, జెక్‌ కాలనీ, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట్, సీతాఫల్‌మండి, పద్మారావునగర్, పార్శీగుట్ట, రాంనగర్, అడిక్‌మెట్, హబ్సిగూడ, ఉప్పల్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, మౌలాలి, కుషాయిగూడ, అంబర్‌పేట్, ఫలక్‌నుమా, తదితర  ప్రాంతాల్లో  ఆదివారం నుంచి శనివారం వరకు ఎక్కడో ఒక చోట  వెలుస్తూనే ఉన్నాయి. కానీ  ఏ ఒక్క మార్కెట్‌లోనూ  భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ కొందరు వాటిని సరైన పద్ధతిలో ధరించకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ‘ఆదివారం వచ్చిందంటే మా కాలనీ ఒక జాతరలా మారుతుంది. అడుగు పెట్టేందుకు అవకాశం ఉండదు. భౌతిక దూరం ఊసే లేదు. పండ్లు, కూరగాయలతో పాటు అత్యవసరం కాని వస్తువులను కూడా విక్రయిస్తున్నారు’ అని తార్నాక గోకుల్‌నగర్‌కు చెందిన లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు.

కొరవడిన నియంత్రణ... 
ప్రతి సోమవారం ఉప్పల్‌ చిలుకానగర్‌ రోడ్డులో నిర్వహించే వారాంతపు మార్కెట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు చికెన్, మాంసం అమ్మకాలు కూడా దర్శనమిస్తాయి. వివిధ రకాల ప్లాస్టిక్‌ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు విక్రయిస్తారు. దీంతో రద్దీ బాగా పెరుగుతోంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అవసరం లేని వస్తువుల విక్రయాలను నియంత్రించకపోవడం వల్ల రద్దీ రెట్టింపవుతోంది. ఒక్క తోపుడు బండి వద్ద ఒకే సమయంలో కనీ సం 15 నుంచి 25 మంది వచ్చి చేరుతున్నారు.మార్కెట్‌లు ముగిసిన తర్వాత కనీసం సోడియం హైపోక్లోరైట్‌ వంటి ద్రావణాలను కూడా స్ప్రే చేయడం లేదు.

తాత్కాలికంగా నిలిపివేయాలి  
వీక్లీ మార్కెట్లు అవసరమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలికంగా  వాటిని  నిలిపివేయాలి. అది సాధ్యం కాకపోతే నియంత్రణ అవసరం. షాపుల మధ్య, మనుషుల మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.  – రమ్య నాయుడు, మల్కాజిగిరి 

అనవసరమైనవి వద్దు..  
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల విక్రయాలను నిలిపివేయాలి. దీంతో చాలా వరకు రద్దీ తగ్గుతుంది. ఇప్పుడు వీక్లీ మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఆ మార్గంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నడవాల్సి వస్తోంది.  – డాక్టర్‌ ఏఎస్‌ మాధురి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు