కాబోయే వైద్యులకూ కావాలి వైద్యం!

10 Apr, 2023 03:41 IST|Sakshi

దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లలో వందలాది మంది మెడికోల ఆత్మహత్యలు 

చదువుల ఒత్తిడి భరించలేక కొందరు.. మనోవేదనతో మరికొందరు బలవన్మరణం 

మధ్యలోనే వైద్య కోర్సులు మానేసిన వారి సంఖ్య వెయ్యిపైనే... 

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అధ్యయనంలో వెల్లడి 

ఒత్తిడి, బలహీనతలకు లోనుకావద్దని సూచన

వారంతా స్టెత్‌పట్టి రోగుల నాడి చూడాల్సిన మెడికోలు... కానీ వారిలో కొందరు మానసిక ఒత్తిళ్లకు చిత్తవుతున్నారు! మనోవేదనను తాళలేక బలవన్మరణాలకు  పాల్పడుతున్నారు!! గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఈ ధోరణి చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలోనూ ఇటీవల కాలంలో పలువురు వైద్య విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. భావిభారత వైద్యులకు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? అందుకుగల కారణాలు ఏమిటి?

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం 2010 నుంచి 2019 మ«ధ్య దేశవ్యాప్తంగా 125 వైద్య విద్యార్థులు, 105 మంది రెసిడెంట్‌ డాక్టర్లు, 128 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బలవన్మరణాలకు పాల్పడిన ప్రతి 10 మందిలో ఏడుగురు 30 ఏళ్లలోపు వారేనని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే (కేరళ మినహా) ఎక్కువ మంది మెడికోల ఆత్మహత్యలు నమోదయ్యాయని, గత ఐదేళ్లలో 64 మంది ఎంబీబీఎస్, 55 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికోలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్‌ఎంసీ వెల్లడించింది.  

ఒత్తిళ్లు.. విభేదాలు.. అనారోగ్యం.. 
మెడికోల ఆత్మహత్యలను ఎన్‌ఎంసీ విశ్లేషించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. మెడికోల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే విభాగాల్లో అనస్తీ షియాలజీ (22.4 శాతం) తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో ప్రసూతి–గైనకాలజీ (16 శాతం) నిలిచింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైద్య విద్యార్థుల్లో (45.2 శాతం), రెసిడెంట్‌ డాక్టర్‌లలో (23.1 శాతం) చదువుల ఒత్తిడి కారణమవుతోంది. అలాగే వైద్యుల దాంపత్య జీవితంలో మనస్పర్థలు (26.7 శాతం), మానసిక సమస్యలు (వైద్య విద్యార్థుల్లో 24 శాతం, వైద్యుల్లో 20 శాతం), వేధింపులు (20.5 శాతం) ఆత్మహత్యలకు ఇతర కారణాలుగా నిలిచాయి.

ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 13 శాతం మంది గతంలో మానసిక వైద్య సహాయం కోరడం గమనార్హం. ఆర్టీఐ కార్యకర్త వివేక్‌ పాండే ఇటీవల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అధ్యయన ఫలితాల్ని విడుదల చేసింది. మరోవైపు వైద్యవృత్తిలో ఉన్నవారిలో ఆత్మహత్య ప్రమాదం సాధారణ జనాభా కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌–జూనియర్‌ డాక్టర్స్‌ నెట్‌వర్క్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ కమిటీ హెడ్‌ రిమీ డే పేర్కొన్నారు. 

చదువుకు గుడ్‌బై చెబుతున్నారు
దాదాపు అన్ని మెడికల్‌ కాలేజీల్లో నియమాలు, రక్షణలు సహాయక వ్యవస్థలు ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని... అందుకే 1,166 మంది విద్యార్థులు వైద్య కళాశాలలకు వీడ్కోలు పలికారని అధ్యయనం తేలి్చంది. వారిలో 160 మంది ఎంబీబీఎస్, 1,006 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. 

ఎన్‌ఎంఏ కీలక సూచనలివీ...
వైద్య విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలి. 
సామాజిక మాధ్యమ పరిధి, ఉపయోగంతో పాటు విచక్షణారహిత వినియోగంతో వచ్చే వృత్తిపరమైన ప్రమాదాల గురించి వైద్య విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. 
♦ రోగులతో సమర్థంగా కమ్యూనికేట్‌ చేయడానికి స్థానిక భాషను నేర్చుకోవాలి. 
♦ విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, మానసిక అనారోగ్య సమస్యల గురించి ప్రొఫెసర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. 
♦ వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న పరిష్కార ప్రక్రియల గురించి అవగాహన పెంచుకోవాలి.

అధ్యయనం జరగాలి... 
‘వెలుగులోకి వచ్చేవి, మీడియా లో చర్చకు నోచుకున్నవే కాదు. బయటకు రాని మరికొన్ని ఆ త్మహత్యల ఉదంతాలూ ఉన్నా యి. ప్రైవేటు మెడికల్‌ కాలేజీ ల్లో నిబంధనల పేరిట విద్యార్థుల్ని విపరీతమైన ఒత్తిడికి లోనుచేస్తున్నారు. ఇక ఆస్పత్రుల్లో 24/7 షిఫ్టులు, కుటుంబానికి దూరంగా ఉండటం, ఆర్థిక కష్టాలు, కొన్ని చోట్ల ర్యాగింగ్, కుల వివక్ష, భవిష్యత్తుపై భయం వంటివి వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరపాలి. నివారించే దిశగా కార్యాచరణ రూపొందించాలి.  – డాక్టర్‌ బీఎన్‌ రావు, ఐఎంఏ అధ్యక్షుడు 

ఒత్తిడి ఉంది... 
పరీక్షల దశలోనే ఒత్తిడి బా గా ఉంది. ఇంటర్న్స్, పీజీలకు రెగ్యులర్‌ డ్యూటీల భారం ఉంటోంది.  ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కు వమంది రోగులు, తక్కువ మంది వైద్యులు ఉండటం వల్ల నిర్ణీత పనివేళలు ఉండవు. సర్జరీల్లో ఉండే వారికి మరింత ఎక్కువ పనిభారం ఉంటోంది.  –డాక్టర్‌ కౌశిక్‌ డెర్మా, జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు 

>
మరిన్ని వార్తలు