Telangana: రద్దీ ఎప్పటిలాగే..

11 Jun, 2021 08:40 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: లాక్‌డౌన్‌ సడలింపులతో జిల్లాలో జనజీవనం సాధారణమైంది. ఉదయం నుంచే రోడ్లు జనసమర్థంగా మారాయి. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపులతో వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు రద్దీగా కనిపించాయి. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, వాణిజ్య దుకాణాలు సాయంత్రం వరకు నడిచాయి. జిల్లాలో కరోనా ప్రభావం, కేసులు పూర్తిగా తగ్గనప్పటికీ ఎక్కడ చూసినా జనం రద్దీగా కనిపించారు. మంగళవారం వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకే జన సంచారం కన్పించగా సడలింపుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.

వ్యాపారులకు ఊరట
లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వ్యాపారులకు ఊరట లభించినట్లయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మొదట ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారుల నిర్వహణ సాధ్యం కాలేదు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లతోపాటు వాణిజ్య దుకాణదారులు తమ వ్యాపారాలు నడుపుకోలేక, షాపుల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. బుధవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులకు ఊరట లభించింది. 

భౌతికదూరం మరిచారు
ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినప్పటికీ కరోనా నిబంధనలను మాత్రం పాటించాల్సిందే. అయితే జిల్లాలో ఎక్కడ కనీసం భౌతికదూరాన్ని పాటించడం లేదు. ఎక్కడ చూసినా జనం గుంపులుగా కనిపించారు. బ్యాంకుల ఎదుట బారులు తీరి ఉన్నారు. దుకాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అమలు చేయాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం 

మరిన్ని వార్తలు