పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి

31 Aug, 2021 10:28 IST|Sakshi

12 ఏళ్లుగా నడవలేని స్థితిలో..

రెండు కాళ్లు చచ్చుబడి అవస్థ పడుతున్న నర్సమ్మ

ఆర్థిక స్తోమత లేక వైద్యం అందని దుస్థితి

దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకోలు 

పాల్వంచ రూరల్‌: రెండు కాళ్లు చచ్చుబడి 12 ఏళ్లుగా ఓ మహిళ దయనీయ జీవనం గడుపుతోంది. భర్తే అన్ని తానై సపర్యలు చేస్తున్నాడు. పేదరికం కారణంగా మెరుగైన వైద్యం అందించలేకపోతున్నట్లు వాపోతున్నాడు. మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన ఉల్వనూరుకు చెందిన పేద దంపతులు ఆసోదు జేమ్స్, నర్సమ్మ. రోజూ వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. 2009, అక్టోబర్‌ 20న ఇంటివద్ద చలిమంట కాస్తుండగా, ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని నర్సమ్మ రెండు కాళ్లు 40శాతం కాలిపోయాయి. దీంతో నరాలు దెబ్బతిన్నాయి.
(చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం)

ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. రూ.2 లక్షలపైన ఖర్చు చేశారు. చికిత్స అనంతరం కొన్నాళ్లు బాగానే నడిచింది. క్రమంగా రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకుంది. 12 ఏళ్లుగా ఇంట్లో మంచానికే పరిమితమై ఉంటోంది. బాత్రూమ్‌కు వెళ్లాలన్నా భర్త తన రెండు చేతుల మీదుగా ఎత్తుకెళ్లాల్సి వస్తోంది. భర్త ఇంటివద్ద లేకుంటే రెండు చేతులకు చెప్పులు వేసుకుని నేలపైన పాకుతూ బాత్రూమ్‌ వరకు  వెళ్తుంది. ఆర్థిక స్తోమత లేక వైద్యం అందించలేకపోతున్నానని, దాతలు స్పందించి చికిత్స అందించేందుకు ఆర్థికసాయం చేయాలని నర్సమ్మ భర్త జేమ్స్‌ వేడుకుంటున్నాడు. దాతలు 63094 69154 నంబర్‌లో సంప్రదించాలని, తన ఎస్‌బీఐ అకౌంట్‌ నంబర్‌ 62281587607 అని తెలిపాడు.

చదవండి: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పు

మరిన్ని వార్తలు