కేటీఆర్‌తో ‘హస్క్‌ ఇంటర్నేషనల్‌’ భేటీ 

15 May, 2023 03:30 IST|Sakshi

రాష్ట్రంలో రూ. 200 కోట్లతో బయో పెల్లెట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదన 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హస్క్‌ పెల్లెట్లు, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ‘హస్క్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌’ప్రతినిధులు ఆదివారం మంత్రి కె. తారక రామారావుతో లండన్‌లో భేటీ అయ్యారు. సుమారు 200 కోట్ల పెట్టుబడితో ఏటా వెయ్యి మెట్రిక్‌ టన్నుల బయో పెల్లెట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటును ప్రతిపాదించింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హస్క్‌ (ధాన్యం ఊక/పొట్టు), పునర్వినియోగానికి వీలుండే ప్లాస్టిక్‌ను సహకార పద్ధతిలో సేకరించేందుకు హస్క్‌ ఇంటర్నేషనల్‌ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో హస్క్‌ ఇంటర్నేషనల్‌ కార్యకలాపాలకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

ఈ భేటీలో హస్క్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌కు చెందిన  ‘ఇంక్రెడిబుల్‌ హస్క్‌ యూకే’సీఈఓ కీత్‌ రిడ్జ్‌వే, ఇంక్రెడిబుల్‌ హస్క్‌ ఇండియా సీఈఓ సీకా చంద్రశేఖర్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఆత్మకూరి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

మరోవైపు లండన్‌ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ అక్కడ ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రతిష్టించిన భారీ అంబేడ్కర్‌ విగ్రహ నమూనాను మ్యూజియం అధికారులకు ఆయన బహూకరించారు.  బారిస్టర్‌ చదువు కోసం ఇంగ్లాండ్‌ వెళ్లినప్పుడు ఆయన నివసించిన ఇంటినే మ్యూజియంగా మార్చారు.  

మరిన్ని వార్తలు