హుస్నాబాద్‌లో నాటుబాంబుల కలకలం.. పేలుడుతో ఉలిక్కిపడ్డ జనం..

23 Nov, 2022 09:32 IST|Sakshi

హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ ఆర్డీసీ బస్టాండ్‌ ఆవరణలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రెండు బాంబులు పేలగా ఐదు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడుతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో మంగళవారం బస్టాండ్‌లోని పార్కింగ్‌ స్థలం పక్కన ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో ప్రయాణికులు, అక్కడున్న జనం ఉలిక్కిపడ్డారు.

తోపుడు బండి కార్మికుడు బస్టాండ్‌లోని తన తోపుడు బండిని బయటకు తీస్తుండగా అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్న నాటుబాంబులకు తగిలి పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఆ కార్మికుడు ఆర్టీసీ సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్‌ వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బందిని రప్పించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణ, పార్కింగ్‌ స్థలంలో తనిఖీలు చేపట్టారు.

బాంబులు ఉన్న స్థలం వద్దకు ఎవర్నీ రానివ్వకుండా కట్టడి చేశారు. అయితే బస్టాండ్‌ ఆవరణలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ నాటు బాంబులు ఊర పందులు, అడవి పందులను అరికట్టేందుకు వినియోగిస్తారని తెలుస్తోంది. గన్‌పౌడర్‌ (నల్ల మందు)తో వీటిని తయారు చేస్తారని సమాచారం. ఎస్సై శ్రీధర్‌ మాట్లాడుతూ బస్టాండ్‌ ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులను పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు