Huzurabad Bypoll 2021: మందు బాబులకు దసరాకు ముందే కిక్కు

29 Sep, 2021 08:35 IST|Sakshi

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు మద్యంజోరు

మండలాల్లో పెరుగుతున్న విక్రయాలు 

నియోజకవర్గానికి పెద్ద ఎత్తున స్టాక్‌ తరలింపు  

సాక్షి,కరీంనగర్‌: నోటిఫికేషన్‌కు ముందే హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు మద్యం కిక్కు ఎక్కుతోంది. ఈటల రాజేందర్‌ రాజీనామాతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం కాగా.. అప్పటి నుంచే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు ఈసీ పచ్చజెండా ఊపడంతో మద్యం మరింత ఏరులైపారనుంది.

ఇప్పటికే రికార్డుస్థాయిలో మద్యం అమ్ముడుపోతుండగా.. పార్టీలు, కులసంఘాలు, సమావేశాలు ఏవైనా మద్యం కిక్కు తప్పనిసరిగా మారింది. ఐదు మాసాలుగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో రూ.వందలకోట్లలో లిక్కర్‌ అమ్మకాలు జరుగుతన్నాయి. ఈ ప్రభావం మరో రెండునెలలు ఉండనుంది. మొత్తంగా ఉప ఎన్నిక నేపథ్యంలో దసరాకు ముందే ఇక్కడివారికి కిక్కు ఎక్కుతోందని చెప్పుకుంటున్నారు. 

అమ్మకాల జోరు.. పక్క జిల్లాల నుంచి దిగుమతి
► హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వేడి ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట ఎక్సైజ్‌ సర్కిల్‌లో మొత్తం 29 దుకాణాలున్నాయి. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.125కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. 2021లో రూ.170కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదికన్నా సుమారు రూ.45 కోట్ల వ్యాపారం అధికంగా జరిగింది.
► గతేడాది ఆగస్టు వరకు రూ.3.60 లక్షల బీర్లు, లిక్కర్లు అమ్ముడవగా,  ప్రస్తుతం లిక్కరు,బీర్లు కలిపి 3,92,616 కేసుల మద్యం అమ్ముడైంది. ముఖ్యంగా గత మూడు నెలల నుంచే రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లామొత్తం రూ.320 కోట్ల వ్యాపారం జరగ్గా.. 55శాతం అమ్మకాలు ఇక్కడే జరగడం విశేషం. నోటిఫికేషన్‌తో అమ్మకాల జోరు మరింత పెరగనుంది.

► హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కేవలం కరీంనగర్‌ జిల్లాకు చెందిన మద్యమే కాకుండా, వివిధ జిల్లాల నుంచి కూడా దిగుమతి అవుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే పెద్దఎత్తున మద్యం నిల్వలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీశాఖకు కూడా భారీగానే ఆదాయం పెరగనుంది.
► ఎన్నికల షెడ్యూలు ఖరారవడం... దసరా తర్వాత ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింత పెరగనున్నాయి. యేటా దసరాకు రూ.కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే ఈసారి హుజూరాబాద్‌లో ఇటు ఎన్నికలు, అటు దసరా పండగ మరింత కిక్కునిస్తుందని తెలుస్తోంది. 

చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్‌షా’ ఎవరో?

మరిన్ని వార్తలు