ఓటర్లకు మాస్కు తప్పనిసరి

30 Oct, 2021 02:36 IST|Sakshi

కోవిడ్‌ నిబంధనలతో పోలింగ్‌ 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌  

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. కోవిడ్‌ నిబంధనలతో పోలింగ్‌ను నిర్వహిస్తామని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఓటర్లు మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఓటు వేసేవారు కరోనా టీకా తీసుకున్నట్టుగా సర్టిఫికెట్‌ చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

అన్ని కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ 
ఈవీఎంలు, వీవీప్యాట్‌లు పోలింగ్‌ కేంద్రాలకు చేరాయని, అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 32 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ సరళిని పరిశీలిస్తారని, 3,868 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు రూ.3.5 కోట్ల నగదును పట్టుకున్నామని, ఈ మేరకు ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని పేర్కొన్నారు. అంధ ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశామని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గోయల్‌ విజ్ఞప్తి చేశారు.  

వారిపై కేసులు నమోదు చేస్తాం 
ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ స్థానికులు కొందరు ఆందోళన చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని శశాంక్‌ గోయల్‌ చెప్పారు. డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని, వారు డబ్బులు అడిగినట్టు తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.   

>
మరిన్ని వార్తలు