Huzurabad Bypoll: మాట ముచ్చట: అయిలన్నా.. ఏం నడ్తందే?

20 Oct, 2021 19:31 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, ఇల్లందకుంట(హుజురాబాద్‌): హుజూరాబాద్‌ ఎలక్షన్‌ హీటెక్కింది. ఎక్కడ విన్నా ఎన్నికల ముచ్చట్లే. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిస్తే ఎన్నికలపైనే చర్చ. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇలా ముచ్చటిస్తున్నారు.
చదవండి: ఈ విషయం తెలుసా..? టీఆర్‌ఎస్‌కు మూడు గుర్తులు 

కొమురయ్య: నమస్తే అయిలన్న. అంతా మంచిదేనా? ఏందే గీలొల్లి. పొద్దటి నుంచి రాత్రి దాకా ఒకటే గిలగిల. ఏం నడ్తందే హుజూరాబాద్‌లా?
అయిలయ్య: లొల్లంటవేందే.. ఓట్లన్నంక గీమాత్రం ఉండదా.

కొమురయ్య: హే.. నేనుపుట్టి గిన్నేండ్లయింది. గిసొంటీ ఓట్లను నేనెన్నడూ సూళ్లే.
అయిలయ్య: నువ్వొక్కనివేందే.. గిసోంటి ఎలచ్చన్లను ఎవ్వలుగూడ జూడలేదు. ఇక మీద గూడా జూడరు.

కొమురయ్య: గిన్నినెలల నుంచి మైకులతోనే నడిచింది. ఈ మధ్య ఎక్కడెక్కడొల్లో వచ్చి ఊళ్లళ్లనే మకాం పెట్టిండ్రు. ఇక్కడనే వండుకుంట, ఉండకుంట, పొద్దుమాపు ఇండ్లసుట్టు తిరుగుతుండ్రు.
అయిలయ్య: ఇది వరకు జరిగిన ఎలచ్చన్లు వేరు. ఈ ఎలచ్చన్లు వేరు. అప్పుడంటే ఎవ్వలఇంట్ల వాళ్లు సక్కబెట్టుకునే వరకు యాళ్లాయే. ఇప్పుడు వేరేటోల్లు కూడా ఈడనే అడ్డా పెట్టిన్రు.

కొమురయ్య: మంది ముచ్చట పక్కకుపెట్టే. మందు, పైసలు గిట్ల బాగానే పంచుతుండ్రట కదా.
అయిలయ్య: మందు, పైసల గురించి మనకెందుకే. గవన్ని ఇచ్చేటోళ్లు ఇస్తరు. తీసుకునేటోళ్లు తీసుకుంటరు. అదంతా పెద్దపెద్దోళ్లకు సంబంధించిన ముచ్చట. మనదాకా రానిత్తరానే.

కొమురయ్య: ఇదివరకు ఊర్లపొంటి జరిగిన ఎలచ్చన్లకు పైసలు తీసుకుని ఓట్లేసినోళ్ల పరిస్థితి ఎట్లున్నదో మనం చూసినం.
అయిలయ్య: నిజమేనే గీమందు, పైసలు మూడ్రోజుల ముచ్చటనే. వచ్చేటోళ్లు వస్తరు. పోయేటోళ్లు పోతరు. గనీ ఈ సారి మాత్రం ఎవరో చెప్పిన్నని కాకుండా మంచోన్నే గెలిపించుకోవాల్నే.
కొమురయ్య: సరేనే గట్లనే నువ్వు జెప్పినట్లే చేద్దాం. కానీ చివరకు ఒక ముచ్చట. గిసోంటి ఎలచ్చన్లు జీవితంలో ఇంకారావు కావచ్చు కాదా.. సరేనే ఆకలి అయితాంది.. ఇంటికి పోతన్న. సాయంత్రం గలుద్దామే.

>
మరిన్ని వార్తలు