Huzurabad: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా..

7 Jun, 2021 11:31 IST|Sakshi

భీమదేవరపల్లి: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో హుజురాబాద్‌ కేంద్రంగా పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని హుజురాబాద్‌ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలు జరిగాయి. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో.. హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే స్థానిక ప్రజలను టీఆర్‌ఎస్‌కు మరింత అనుకూలంగా మలుచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లా కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదన్న వాదన సైతం ఉంది. దీంతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా స్థానంలో హుజురాబాద్‌ను ప్రకటించే అవకాశాలు సైతం లేకపోలేదని తెలుస్తోంది.

వంగరలోని పీవీ విగ్రహం 
పట్టించుకోని నాయకులు 
పీవీ మరణానంతరం సొంత పార్టీ నాయకులే ఆయనను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అయితే దక్షాణాది రాష్ట్రాల నుంచి అత్యున్నతమైన ప్రధాని పీఠాన్ని అధిష్టించిన పీవీపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటుగా రూ.11కోట్ల వ్యయంతో పీవీ స్వగ్రామమైన వంగరలో పీవీ స్మృతివనం, భీమదేవరపల్లి కస్తూరీబాగాంధీ పాఠాశాల నుంచి వంగర వరకు డబుల్‌ బీటీ రోడ్డు, ఆర్చీ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

అంతేకాకుండా పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. ఈనెల 28న పీవీ శతజయంతి నేపథ్యంలో వంగరలోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట పీవీ స్మృతివనం పనులు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే పీవీ నివాస గృహాన్ని వారి కుటుంబ సభ్యులు ఆధునీకరించడంతో పాటుగా పీవీ ఉపయోగించిన వస్తువులను హైదరాబాద్‌ నుంచి వంగరకు తరలించి భద్రపరిచారు. వాటిని పీవీ ఇంట్లో ఏర్పాటు కానున్న మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.  

12 మండలాలతో నూతన జిల్లా..
కాగా హుజురాబాద్‌ జిల్లా ఏర్పాటుకు 12 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీవీ గ్రామమైన వంగరకు 8 కిలోమీటర్ల దూరంలోని హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించి అందులోకి వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాలు, కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శం కరపట్నం, సైదాపూర్, చిగురుమామిడితో పాటుగా భీమదేవరపల్లి మండల పరిధిలోని పీవీ స్వగ్రామం వంగర, వీరభద్రస్వామి దేవస్థానం కల్గిన కొత్తకొండను మండలాలుగా ఏర్పాటు చేసి మొత్తం 12 మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు కు అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం.

వంగరలోని పీవీ ఇల్లు  
శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించే అవకాశం
ఈనెల 28న జరగనున్న పీవీ శతజయంతి ఉత్సవాల్లో హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఈటలకు చెక్‌ పెట్టడంతో పాటుగా ఈ ప్రాంత ప్రజలను టీఆర్‌ఎస్‌ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతం కావచ్చనే అభిప్రాయం ఆ పార్టీలో నెలకొంది. అయితే ఇప్పటికే పీవీ కూతురు సురభి వాణీదేవీకి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి గెలిపించిన విషయం తెలిసిందే. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలకు వంగరకు సీఎం కేసీఆర్‌ హాజరై జిల్లా ప్రకటనతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధిపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు, రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

దీక్షకు సిద్ధమవుతున్న గ్రామస్తులు
అయితే పీవీ పేరిట జిల్లా ఏర్పాటుతో పాటుగా వంగరను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కండె రమేశ్, కండె చక్రపాణి, కండె సుధాకర్‌ తదితరులు దీక్షకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు కొత్తకొండను మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చెప్యాల ప్రకాశ్, ఉప్పుల కుమారస్వామి, సిద్దమల్ల కృష్ణ తదితరులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
చదవండి: Huzurabad: ఉప ఎన్నికపై గులాబీ వ్యూహం

మరిన్ని వార్తలు