Work From Home: ఆఫీసుకు హాయ్‌.. ఇంటికి బైబై..కారణం ఇదే! 

29 Oct, 2021 07:28 IST|Sakshi

ఇక నుంచి ఐటీ రంగంలో హైబ్రీడ్‌ మోడల్‌!

ఇళ్లు, ఆఫీసు నుంచి పనిచేసే వెసులుబాటు

మెజార్టీ ఉద్యోగులను ఆఫీసు బాట పట్టించే యత్నం

హైబ్రీడ్‌ విధానానికి తగ్గట్టు మార్గదర్శకాల తయారీ

హైసియా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న గ్రేటర్‌ ఐటీ రంగం.. ఉద్యోగుల పనివిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతనంగా హైబ్రీడ్‌ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై దృష్టిసారించింది. తమ ఉద్యోగుల్లో సుమారు 70 శాతం మందిని కార్యాలయాలకు రప్పించడం.. ఇతరులను ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించడమే ఈ హైబ్రీడ్‌ మోడల్‌ లక్ష్యం.  తాజా పరిస్థితుల్లో పలు కంపెనీలు అదనంగా ఆఫీస్‌ స్పేస్‌ కోసం అన్వేషిస్తున్నప్పటికీ.. సమీప భవిష్యత్‌లో హైబ్రీడ్‌ మోడల్‌ అమలుకే దాదాపు అన్ని కంపెనీలు మొగ్గుచూపుతాయని హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) వర్గాలు తెలిపాయి.
ఛదవండి: నిపుణుల వేటలో టాప్‌ 5 కంపెనీలు.. మొదటి 9 నెలల కాలంలో..

ప్రధానంగా గ్రేటర్‌ పరిధిలో మెరుగైన మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత అందుబాటులో ఉండటంతో ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ కొత్త స్టార్టప్‌ కంపెనీలు, ఐటీ కంపెనీలు అధికంగా ఆఫీస్‌ స్పేస్‌ను దక్కించుకుంటున్నాయని పేర్కొన్నాయి. భవిష్యత్‌లో కరోనా మళ్లీ విజృంభించినా.. సవాళ్లను ఎదుర్కొని ధీటుగా పనిచేసేలా తమ సంస్థలను హైబ్రీడ్‌ పనివిధానం వైపు మళ్లిస్తున్నాయన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఆయా సంస్థలు నిమగ్నమవడం విశేషం. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు సైతం ఈ విధానాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆఫీస్‌ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయని తెలిపాయి. 

దేశంలోని నగరాలతో పోలిస్తే అగ్రభాగం.. 
ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో హైదరాబాద్‌ దేశంలోని పలు మెట్రో నగరాలతో పోలిస్తే అగ్రభాగాన నిలుస్తోంది. తాజాగా పూర్తిస్థాయిలో వినియోగానికి అనుకూలంగా ఉన్న ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత నగరంలో 9 కోట్ల చదరపు అడుగుల మైలురాయిని అధిగమించినట్లు ప్రముఖ స్థిరాస్థి కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌(హైసియా) సంయుక్త అధ్యయనంలో తేలడం విశేషం. ఐదేళ్లుగా నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ రెట్టింపయినట్లు పేర్కొంది. ఐటీ, ఐటీ అనుంబంధ రంగాలు, లైఫ్‌సైన్సెస్, ఎల్రక్టానిక్స్‌ తదితర రంగాల కంపెనీలు పెద్ద ఎత్తున నగరంలో తమ కార్యాలయాలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో మరో 3 నుంచి 3.5 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం నగరంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. 

కారణం ఇదే..! 
నగరంలో బడా, చిన్న ఐటీ కంపెనీలు ఏడాదిన్నరగా అవలంబిస్తున్న పూర్తి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి స్వస్తి పలికి హైబ్రీడ్‌ విధానానికి శ్రీకారం చుట్టనున్నాయి. ఆయా కంపెనీల ఉద్యోగుల్లో 70 శాతం మందికి కోవిడ్‌ టీకా రెండు డోసులు పూర్తయ్యాయి. 95 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు నుంచి ఉద్యోగుల్ని క్రమంగా కార్యాలయాలకు రప్పించాలని ఆలోచిస్తున్నట్లు హైసియా ప్రతినిధులు తెలిపారు. కొన్ని కంపెనీల్లో  ఇంటి నుంచి పని కారణంగా ఉత్పాదకత తగ్గడంతోపాటు కొందరు ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం బయటి ప్రాజెక్టులు చేపట్టడంతో అధిక సమయం వాటిపైనే వెచ్చిస్తున్నట్లు కంపెనీల దృష్టికి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకు రప్పించడానికి ఇదే ప్రధాన కారణమని వారు పేర్కొనడం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు