సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో...

22 Nov, 2021 12:56 IST|Sakshi
సిరిన అక్తర్‌ (ఫైల్‌)

అతడితో కలిసి ఉండేందుకు అక్రమ మార్గంలో రాక

బోగస్‌ పేరుతో హైదరాబాద్‌ నుంచి ఆధార్, పాన్‌ కార్డులు

ఆమెను ఇటీవల అరెస్టు చేసిన అహ్మదాబాద్‌ పోలీసులు

నకిలీ గుర్తింపు పత్రాలు ఇచ్చినవారి కోసం గాలింపు

అరెస్టు చేసేందుకు నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దళారీ హితేష్‌ జోషితో బంగ్లాదేశ్‌కు చెందిన సిరిన అక్తర్‌ హుస్సేన్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇతడి కోసం ఆమె అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి బోగస్‌ గుర్తింపు పత్రాలు పొందింది. ఇటీవల ఆ విషయం వెలుగులోకి రావడంతో గుజరాత్‌ పోలీసులు సిరినను అరెస్టు చేశారు. ఈమెకు ఫోర్జరీ పత్రాలు అందించిన నగరవాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి చేరుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. 

చదవండి: ఇక బస్సులపై  ప్రకటనలు ఉండవు

హితేష్‌– సిరిన మధ్య 2016లో ఫేస్‌బుక్‌ స్నేహం ఏర్పడటంతో ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌ చాటింగ్స్‌లో ప్రేమించుకున్నారు.  తొలుత హితేష్‌ను కలుసుకోవాలని భావించిన సిరిన 2017 మార్చిలో 90 రోజుల విజిట్‌ వీసాపై భారత్‌కు వచ్చి వెళ్లింది. ఆపై అతడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుని అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చేసింది. 
చదవండి: నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే 

బంగ్లాదేశ్‌లో ఉన్న దళారుల ద్వారా కోల్‌కతా చేరుకున్న సిరిన అక్కడి నుంచి హైదరాబాద్‌ చేరుకుంది. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుల ద్వారా గుత్తా సోను బిశ్వాస్‌ పేరుతో నకిలీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులు సంపాదించింది. వీటిని తీసుకుని అహ్మదాబాద్‌ వెళ్లి హితేష్‌ను కలిసింది. 2017 అక్టోబర్‌ నుంచి అక్కడి సనాతన్‌ ప్రాంతంలో వీళ్లిద్దరూ సహ జీవనం చేయసాగారు. 2018లో వీరికి ఓ కుమార్తె జన్మించింది.  

2020లో సిరిన.. సోను పేరుతో అహ్మదాబాద్‌ రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు కూడా పొందింది. దీన్ని వినియోగించి భారతీయురాలిగా బంగ్లాదేశ్‌ వెళ్లి తన కుటుంబీకులను కలిసి వచ్చింది. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న ఈమె వ్యవహారం హితేష్‌ మరణంతో బయటకు పడింది. గత నెల ఆఖరి వారంలో హితేష్‌ అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. ఆపై సిరిన అలియాస్‌ సోను అతడి తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తి వాగ్వాదానికి కారణమైంది. దీంతో ఆవేశానికి గురైన హితేష్‌ తల్లిదండ్రులు సిరినను ఉద్దేశించి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ అంటూ దూషించారు.  ఈ సమాచారం సనాతల్‌ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు గత వారం సిరినను అరెస్టు చేశారు. 

సిరినకు సోను పేరుతో ఆధార్, పాన్‌ కార్డులు తయారు చేసిన ఇచ్చిన నిందితుల కోసం అహ్మదాబాద్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఆదివారం హైదరాబాద్‌ పంపారు. సిరిన కేవలం హితేష్‌పై ఉన్న ప్రేమతోనే ఇలా అక్రమంగా వచ్చిందని, ఈ కేసులో మరే ఇతర కోణం లేదని అహ్మదాబాద్‌ పోలీసులు చెబుతున్నారు. చట్ట ప్రకారం ఆమె చేసింది నేరం కావడంతో అరెస్టు చేశామని వివరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు