క్షుద్ర పూజల కలకలం.. కూకట్‌పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం

26 Oct, 2022 13:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్‌ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్‌ కుమార్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్‌నగర్‌లోని అలీతలాబ్‌ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్‌ షీట్‌) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్‌ కార్డు లేని ఓ సెల్‌ ఫోన్‌ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్‌ క్లూస్‌ టీంతో పాటు పోలీస్‌ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. 

అన్నీ అనుమానాలే... 
శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు.  పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. 

మరిన్ని వార్తలు