Jubilee Hills: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి..

15 Apr, 2022 09:05 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: పబ్‌ నిర్మాణం కోసం సిద్ధం చేస్తున్న భవనంలోకి తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా ప్రవేశించడంతోపాటు బౌన్సర్లను తీసుకొచ్చి బీభత్సం సృష్టించిన ముగ్గురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం. 36లోని ఎఫ్‌హౌజ్‌ భవనాన్ని రామ్‌ నరేష్‌ దండా అనే వ్యక్తి గత ఏడాది నవంబర్‌లో ఎం.రోహిత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. దీనిలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పబ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

గత ఏడాది నవంబర్‌ నుంచి రామ్‌ నరేష్‌ దండా ఆధీనంలో ఉన్న ఈ భవనంలో రినోవేషన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 11న జెట్టి సంతోష్‌రెడ్డి, భరత్, రాజేష్‌ అనే వ్యక్తులు ఏడుగురు బౌన్సర్లను తీసుకొచ్చి పబ్‌ పనులు నడుస్తున్న భవనం తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా లోనికి ప్రవేశించారు. అక్కడున్న సీసీ కెమెరాలను ఆపేయడంతో పాటు డీవీఆర్‌తోపాటు మేనేజర్‌ క్యాబిన్‌లోని డెస్క్‌లో ఉండాల్సిన రూ. లక్షను తస్కరించారు.
చదవండి: సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..

గతంలో ఈ పబ్‌ను నడిపించేందుకు ప్రయత్నించిన సంతోష్‌రెడ్డి తదితరులు భాగస్వాములతో విభేదాల కారణంగా దీన్ని రాంనరేష్‌కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే మరిన్ని డబ్బులు డిమాండ్‌ చేసేందుకు భవనాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు రాంనరేష్‌ దండా జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 455, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మరిన్ని వార్తలు