రూ.125 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.. బుకింగ్స్‌ ఫ్రమ్‌ టాంజానియా! 

7 May, 2022 21:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల వరుసగా పట్టుబడిన రూ.125 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ముమ్మరం చేశారు. డ్రగ్స్‌ తీసుకువస్తూ పట్టుబడిన వారంతా క్యారియర్స్‌గా గుర్తించిన అధికారులు విదేశంలోని సప్లయర్లతో పాటు ఇక్కడి రిసీవర్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పక్కా పథకం ప్రకారం ఈ స్మగ్లింగ్‌ చేయిస్తున్న సప్లయర్లు, మాదకద్రవ్యాలను తీసుకునే రిసీవర్లు ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. విమానాశ్రయంలో గడిచిన పక్షం రోజుల్లో నాలుగు కేసుల్లో చిక్కిన వారిలో టాంజానియన్లే ఎక్కువ మంది ఉన్నారు.

ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఈ డ్రగ్‌ హైదరాబాద్‌లో తీసుకునే రిసీవర్లు ఎవరనేది నిందితులకు కూడా తెలియదని అధికారులు చెప్తున్నారు. డ్రగ్‌తో ప్రయాణిస్తున్న క్యారియర్ల కోసం నగరంలో హోటల్‌ గదులనూ సప్లయర్లే బుక్‌ చేశారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న సద్గురు ట్రావెల్స్‌ సంస్థకు టాంజానియాలోనూ బ్రాంచ్‌ ఉంది. ఆ శాఖ నుంచే క్యారియర్ల కోసం సప్లయర్లు గచ్చిబౌలి, మాదాపూర్, మాసబ్‌ట్యాంక్‌ల్లోని హోటళ్లలో రూమ్స్‌ బుక్‌ చేశారు. క్యారియర్లతో పాటు ఈ బుకింగ్‌ రసీదులనూ సప్లయర్లు పంపారు. వీటిని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు సదరు ట్రావెల్స్‌ సంస్థను సంప్రదించారు. టాంజానియాలోని తమ బ్రాంచ్‌కు వెళ్లిన కొందరు ఈ గదులను క్యారియర్స్‌గా వస్తున్న వారి కోసం బుక్‌ చేశారని, ఆ సందర్భంలో సగం నగదు చెల్లించాలని కోరినా... చెక్‌ ఇన్‌ సమయంలో ఇస్తామంటూ దాట వేశారని సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తాము ఆ గదులను బుక్‌ చేయకుండా కేవలం బ్లాక్‌ చేసి ఉంచామని వివరించారు. సద్గురు ట్రావెల్స్‌కు సంబంధించిన టాంజానియా బ్రాంచ్‌కు వెళ్లిన వారి వివరాలు తెలపాల్సిందిగా డీఆర్‌ఐ ఆ సంస్థను కోరింది. క్యారియర్లు డ్రగ్స్‌తో వచ్చిన విమానంలోనే సప్లయర్లు, రిసీవర్లకు చెందిన వ్యక్తి కూడా ప్రయాణించి, పరిస్థితులను గమనించి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా విమానాల్లో ప్రయాణించిన వారి జాబితాలను విశ్లేషిస్తున్నారు.

క్యారియర్లు డ్రగ్స్‌తో విమానాశ్రయం దాటి వచ్చిన తర్వాత బస చేయాల్సిన హోటల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులకు రిసీవర్‌ నేరుగా వెళ్లి సరుకు తీసుకునేలా సప్లయర్లు పథకం వేశారు. క్యారియర్లు చిక్కినా తాము పట్టుబడకూదనే డ్రగ్‌ స్మగ్లర్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని డీఆర్‌ఐ అధికారులు చెప్తున్నారు. ఈ కేసుల్లో ఇతర నిందితులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు.   
చదవండి: మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి

మరిన్ని వార్తలు