Hyderabad: కేజీఎఫ్‌–2 చూసి.. రాఖీభాయ్‌లా సిగరెట్లు కాల్చి..

29 May, 2022 13:36 IST|Sakshi

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన కేజీఎఫ్‌ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2 కూడా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్‌ చిత్రంతో యశ్‌ గ్రాఫ్‌ అంతకముందు.. ఆ తరువాత అనేలా మారిపోయింది. ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్‌ చిత్రానికి యశ్‌ హీరోయిజమే మెయిన్‌ అట్రాక్షన్‌.. సినిమాలో హీరో మాటలు, ఆటిట్యూడ్‌, అలవాట్లు ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాను పదే పదే చాడటానికి యువతి ఇష్టపడుతున్నారు.

యష్‌ నటించిన కేజీఎఫ్‌–2 సినిమాలోని ‘రాఖీభాయ్‌’ పాత్రను చూసి తానూ అలాగే స్టైల్‌గా ఉండాలనుకున్న 15 ఏళ్ల బాలుడు సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ బాలుడికి తాము విజయవంతంగా చికిత్స చేసినట్లు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12లోని సెంచరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సిగరెట్‌ కాల్చడం వల్ల వచ్చే దుష్ప్ర­భావాల నుంచి ఊరట కలిగించడంతో పాటు ఆ బాలుడుకి గట్టిగా కౌన్సింగ్‌ కూడా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవధిలో కేజీఎఫ్‌–2 సినిమాను మూడుసార్లు చూశాడు. తర్వాత ఒకేసారి ఏకంగా ఒక ప్యాకెట్‌ సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు సెంచరీ ఆస్పత్రికి తరలించారు. థియేటర్లలో విడుదలైన రెండోవారం ఆ సినిమా చూసిన బాలుడు అందులో ప్రధాన పాత్ర అయిన రాఖీభాయ్‌ స్టైల్‌ చూసి ప్రేరణ పొందానని.. తాను అలాగే ఉండాలని కోరుకున్నానని అందుకే సిగరెట్లు కూడా కాల్చానని వెల్లడించాడు. 

కాగా ఈ కేసుపై పల్మోనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. ప్రేక్షకులు ముఖ్యంగా టీనేజర్లు ‘రాకీ భాయ్’ వంటి పాత్రలతో తొందరగా ప్రభావితమవుతరాని అన్నారు. ఈక్రమంలోనే మైనర్‌ ధుమపానానికి అలవాటు పడి ఒకే రోజు సిగరెట్‌ ప్యాకెట్‌ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. మనుషులపై సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం అని, సిగరెట్లు తాగడం. పొగాకు నమలడం, మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత సినీ నిర్మాతలు, నటీనటులపై ఉంటుందన్నారు.
చదవండి: భయ్యా.. ఇదేమయ్యా!  నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో

అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వ్యవసనాలకు అలవాటు పడుతున్నారో తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలు చెడు వ్యవసనాలకు బానిసలవ్వడకుండా అవగాహన కల్పించడంలో తల్లిదండ్రల పాత్ర ముఖ్యమంన్నారు.

మరిన్ని వార్తలు