ఫోనుకు బదులు సబ్బు, సర్ఫ్‌.. అమెజాన్‌కు మొట్టికాయ  

10 Jul, 2021 10:02 IST|Sakshi

 రూ.10 వేలు జరిమానా విధిస్తూ వినియోగదారుల ఫోరం తీర్పు

ఫోనుకు బదులు సబ్బు, సర్ఫ్‌ ఘటనలో బాధితుడికి ఉపశమనం  

సాక్షి, ముషీరాబాద్‌: ఫోనుకు బదులుగా సబ్బు, సర్ఫ్‌ ను వినియోగదారుడికి అందించిన అమెజాన్‌ సంస్థకు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం–2 మొట్టికాయ వేసింది. ఫోన్‌ విలువతో పాటు రూ.10 వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ఫోరం సభ్యుడు పీవీటీఆర్‌ జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్‌.ఎస్‌.రాజశ్రీలతో కూడిన బెంచ్‌ తీర్పునిచ్చింది. హైదరాబాద్‌ బీకేగూడ పార్కు వద్ద నివసించే ప్రైవేటు ఉద్యోగి అయిన పి.విజయ్‌కుమార్‌ 2020 డిసెంబర్‌ 19న అమెజాన్‌లో ఒప్పో సెల్‌ఫోన్‌ను రూ.11,990 చెల్లించి ఆర్డర్‌ చేశారు. అయితే ఫోనుకు బదులుగా ఒక సబ్బు, సర్ఫ్‌ ప్యాకెట్‌తో కూడిన పార్సల్‌ అందింది. వెంటనే విజయ్‌కుమార్‌ అమెజాన్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

అయినప్పటికీ అమెజాన్‌ నుంచి స్పందన రాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై ఆమెజాన్‌ ఇండియా మేనేజర్, అప్పారియో రిటైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజర్‌కు ఫోరం నోటీసులు జారీ చేసింది. వారి తరుపున హాజరైన న్యాయవాదులు ఫిర్యాదు దారుడికి సరైన సాక్ష్యాలు చూపించక పోవడంతో వినయ్‌కుమార్‌ చెల్లించిన రూ.11,990లకు 9శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, ఫిర్యాదు దారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5వేలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం2 ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగులో తీర్పు.. 
తెలంగాణ వినియోగదారుల ఫోరం సభ్యుడు పీవీటీఆర్‌.జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్‌.ఎస్‌.రాజశ్రీలతో కూడిన బెంచ్‌ తెలుగులో తీర్పును వెలువరించింది.  
 

మరిన్ని వార్తలు