Hyderabad Metro: ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? 

28 Jun, 2021 10:45 IST|Sakshi

మెట్రో రెండోదశపై నీలినీడలు!

తొలిదశలో ఒడిదుడుకుల జర్నీయే కారణం

గచ్చిబౌలి–శంషాబాద్‌ సహా పలు మార్గాల్లో రెండోదశపై అనుమానాలు

రూ.16 వేల కోట్ల ప్రాజెక్టుకు నాలుగేళ్లుగా నష్టాలే..

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రెండోదశ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలిదశ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం రూట్లలో 69 కి.మీ మార్గంలో పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థ రూ.16 వేల కోట్లు వ్యయం చేసింది. మెట్రో ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా నష్టాల బాట తప్పడంలేదు. గతేడాదిగా కోవిడ్‌ విజృంభణ, వరుస లాక్‌డౌన్‌ల కారణంగా మెట్రోకు కష్టాలు..నష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సంఖ్య గతేడాది లాక్‌డౌన్‌కు ముందు నాలుగున్నర లక్షలు కాగా.. తాజాగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో సంఖ్య సుమారు 80 వేలుగా ఉన్నట్లు మెట్రో రైలు వర్గాలు తెలిపాయి.  

అంచనాలు తలకిందులు... 
మెట్రో మాల్స్‌ నిర్మాణం, వాణిజ్య ప్రకటనలు, రవాణా ఆధారిత, రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా భారీగా రెవెన్యూ ఆర్జించవచ్చన్న నిర్మాణ సంస్థ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టడం దాదాపు అసాధ్యమే. తాజా అనుభవాలతో మెట్రో ప్రాజెక్టులు వాణిజ్య పరంగా అంతగా గిట్టుకాటు కావని రుజువుకావడంతో..ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలు సైతం ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడంలేదు. విశ్వవ్యాప్తంగా సుమారు వందకు పైగా మెట్రో రైలు ప్రాజెక్టులుండగా.. సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపి మినహా మిగతా అన్ని ప్రాజెక్టులదీ నష్టాల బాటేనన్నది నిర్మాణరంగ సంస్థ వర్గాల మాట కావడం గమనార్హం. 

రెండోదశ కింద ప్రతిపాదించిన మార్గాలివే.. 
మెట్రో రెండోదశ కింద బీహెచ్‌ఈఎల్‌–లక్డీకాపూల్‌ (29 కి.మీ), గచ్చిబౌలి–శంషాబాద్‌ (22 కి.మీ) మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనా ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ జఠిలంగా మారడంతో రెండోదశ మెట్రో ప్రాజెక్టు ఎప్పటికి సాధ్యపడుతుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
బీహెచ్‌ఈఎల్‌–లక్డీకాపూల్‌ మెట్రో మార్గం ఇదీ.. 
► బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్‌ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్‌ సిద్ధమైంది.  
► ఈ మార్గం మొత్తంగా 29 కి.మీ ఉంటుంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)లతోపాటు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు సమగ్ర   ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు.  
► బీహెచ్‌ఈఎల్‌ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్‌ మీదుగా ఆల్విన్‌ క్రాస్‌ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా లక్డీకాపూల్‌ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది.  

గచ్చిబౌలి–శంషాబాద్‌  మెట్రో రూటు ఇదీ.. 
►గచ్చిబౌలి–రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిరి్మంచడానికి డీపీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది.   
► బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడా తెలంగాణా పోలీస్‌ అకాడమీ, రాజేంద్రనగర్‌ మీదుగా శంషాబాద్‌ వరకు ఏర్పాటుచేయాల్సి ఉంది.  
► ఈ మార్గంలో హైస్పీడ్‌ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈమేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు రెండోదశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. 
► కాగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ (ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించినా నిధుల లేమితో ఈ మెట్రో రూటు సైతం కాగితాలకే పరిమితమవడం గమనార్హం. 

ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? 
గతంలో మరో ఐదు మార్గాల్లో రెండోదశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ ఆదిశగా అడుగులు పడకపోవడంతో ఈ కింది మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
1.ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ 
2.ఎల్‌బీనగర్‌–ఫలక్‌నుమా–శంషాబాద్‌  అంతర్జాతీయ విమానాశ్రయం 
3.మియాపూర్‌–పటాన్‌చెరు 
4.తార్నాక–ఈసీఐఎల్‌ 
5.జేబీఎస్‌ –మౌలాలి 

మరిన్ని వార్తలు